దక్షిణాదిలోనే 'బంగారం'ఎక్కువ!
అందుకే ఈ ప్రాంతంలోనే చోరీలకు మొగ్గు
* హైదరాబాద్ నుంచి పారిపోవడం తేలిక
* పోలీసుల విచారణలో వెల్లడించిన భోపాల్ స్నాచర్లు
* నిందితుల కస్టడీ కోరిన రెండు ఠాణాల అధికారులు
సాక్షి, హైదరాబాద్: ‘గణేష్’ బందోబస్తు ముగియడంతో కాస్త రిలాక్స్‌గా ఉన్న పోలీసుల మూడ్‌ను ఆసరాగా చేసుకుని సెప్టెంబర్ ఆఖరి వారంలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లను మధ్యప్రదేశ్‌లోని భోపాల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. గ్యాంగ్ లీడర్ ముర్తుజా వ్యవహారశైలిపై సమాచారం అందుకున్న అక్కడి జహంగిరాబాద్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా దేశవ్యాప్తంగా 13 నగరాల్లో చేసిన 150 స్నాచింగ్‌ల గుట్టురట్టయింది. దీంతో ఈ గ్యాంగ్‌కు చెందిన మరో నలుగురినీ గత నెల 16న అరెస్టు చేశారు. హైదరాబాద్, సైబరాబాద్‌ల్లో 17 స్నాచింగ్స్ చేసినట్లు వీరు అంగీకరించడంతో టాస్క్‌ఫోర్స్ నేతృత్వంలో ఇక్కడి అధికారులు వెళ్లి విచారించి వచ్చారు. ఈ నేపథ్యంలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.
ఇక్కడే గొలుసుల బరువు ఎక్కువట..
విచారణ సమయంలో దక్షిణాదితో పాటు హైదరాబాద్, సైబరాబాద్‌లపై ఎందుకు కన్నేశారనీ ఈ ముఠాను టాస్క్‌ఫోర్స్ అధికారులు ప్రశ్నించగా.. వారు చెప్పిన సమాధానం విని అధికారులే అవాక్కయ్యారు. ఉత్తర భారతంలో మహిళలు మెడలో పుస్తెలతాడు లేదా బంగారు గొలుసులు ధరించి తిరగడం తక్కువట. ఒకవేళ ఎవరైనా తిరిగినా దాని బరుకు గరిష్టంగా తులం, అంతకంటే తక్కువగానే ఉంటుందని ముర్తుజా గ్యాంగ్ బయటపెట్టింది. అదే దక్షిణాది విషయానికి వస్తే.. ఇక్కడ మహిళలు కచ్చితంగా పుస్తెలతాడు ధరించడంతో పాటు ఏ గొలుసు చూసినా కనిష్టంగా మూడు తులాలు ఉంటుందని వెల్లడించారు. దీంతోపాటు హైదరాబాద్, సైబరాబాద్‌ల్లో భాష సమస్య లేకపోవడంతో పాటు ప్రధాన రహదారులకు అనుసంధానంగా ఉండే లైన్లు, బైలైన్లు ఎక్కువ కావడంతో తప్పించుకోవడమూ తేలికని వివరించారు.
బీదర్ నుంచి బైక్‌పై వచ్చి..
ఈ ముఠా సెప్టెంబర్ 27, 29 తేదీల్లో సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో పంజా విసిరింది. సిటీలో 9, సైబరాబాద్‌లో 8 స్నాచింగ్స్ చేసి ఉడాయించింది. ఈ నేరాలు చేయడానికి ముఠా సభ్యులు కర్ణాటకలోని బీదర్ నుంచి వచ్చి వెళ్లినట్లు తేలింది. బీదర్‌లో ఇరానీ ఏరియాకే చెందిన ఓ వ్యక్తి నుంచి 3 ద్విచక్ర వాహనాలు తీసుకుని.. ఉదయం 6కు అక్కడ బయలుదేరి, 8.30 కల్లా ఇక్కడకు చేరుకునేది. ఉదయం 10.30లోపు ‘పని’ పూర్తి చేసుకుని మధ్యాహ్నం ఒంటిగంటకు బీదర్ వెళ్ళిపోయింది. ముఠా సభ్యులు ఇద్దరు ఓ ద్విచక్ర వాహనంపై ముందు వెళ్తుండగా.. మరో గ్యాంగ్ మెంబర్ చోరీ సొత్తుతో వీరిని మరో వాహనంపై అనుసరిస్తూ వెళ్తాడు. ఎక్కడైనా ఆపి తనిఖీలు చేసినా, ముందు వెళ్తున్న వారు చిక్కినా చోరీ సొత్తు మాత్రం చేతులు దాటకుండా ఈ ఏర్పాట్లు చేసుకున్నారు.
ఏపీలోనూ..
ఈ గ్యాంగ్ హైదరాబాద్, సైబరాబాద్‌లతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తదితర చోట్లా పంజా విసిరింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 13 నగరాల్లో 150 నేరాలు చేసింది. ఈ దఫా జంట కమిషనరేట్లలో 17 స్నాచింగ్‌లతో పాటు బెంగళూరులో 21, దావనగెరెలో 9, మైసూర్‌లో 7, విశాఖలో 5, మధురైలో 4, విజయవాడలో 4, కోలార్‌లో 3, కొయంబత్తూర్, తిరుచ్చి, టుంకూర్‌ల్లో రెండేసి చొప్పున స్నాచింగ్స్ చేసినట్లు జహంగిరాబాద్ పోలీసుల విచారణలో బయటపెట్టింది. జంట కమిషనరేట్లలో మినహా మిగిలిన అన్ని చోట్లా చోరీ వాహనాలు వినియోగిచే నేరాలు చేశారు. మధ్యప్రదేశ్ పోలీసుల కస్టడీలో ఉన్న నిందితుల్ని ప్రిజనర్స్ ట్రాన్సిట్(పీటీ) వారంట్‌పై హైదరాబాద్ తీసుకురావడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎస్సార్ నగర్, చిక్కడపల్లి పోలీసులు స్నాచర్ల కస్టడీ కోరుతూ అక్కడి కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వచ్చే వారం కోర్టు అనుమతించే అవకాశం ఉంది.
రైల్వేస్టేషన్ సమీపంలోనే అడ్డా..
సాధారణంగా ఇరానీ ముఠాలన్నీ ఆయా నగరాల్లోని రైల్వేస్టేషన్ల సమీపంలోనే స్థావరాలు ఏర్పాటు చేసుకుంటారు. ముర్తుజా(30) అలియాస్ బాబర్ నేతృత్వంలోని ఈ ముఠా కూడా జహంగిరాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోని ఇరానీ క్యాంప్ కేంద్రంగానే పని చేసింది. అదే ప్రాంతానికి చెందిన షాదాబ్ (23), హైదర్(19), గుఫ్రాన్(19), రాజా అలీ(18) ఈ ముఠాలో సభ్యులు. చైన్ స్నాచింగ్స్, అటెన్షన్ డైవర్షన్, సూడో పోలీసు వంటి నేరాలు చేసే ఈ ముఠా ప్రస్తుతం స్నాచింగ్స్ మీదే దృష్టి పెట్టి రెచ్చిపోయింది. ఒక ప్రాంతాన్ని టార్గెట్‌గా ఎంచుకుని.. అక్కడ మకాం ఏర్పాటు చేసుకోవడం, తొలుత బైక్ దొంగతనం చేసి స్నాచింగ్స్‌కు పాల్పడటం, చివరకు ఆ బండిని వదిలేసి పారిపోవడం వీరి నైజం.