రూ.2 కోట్ల విలువైన బంగారం పట్టివేత
కోజికోడ్: అక్రమమార్గంలో దేశంలోకి తీసుకువచ్చేందుకు యత్నించిన ఏడు కిలోల బంగారం పట్టుబడింది. కేరళలోని కరీపూర్ ఎయిర్‌పోర్టులో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. బహ్రెయిన్‌లో ఉంటున్న ఇద్దరు కేరళీయులు ఒమన్ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానంలో మంగళవారం ఉదయం 4.30గంటలకు కరీపూర్ చేరుకున్నారు.
అనుమానాస్పదంగా ఉన్న వారి కదలికలను గుర్తించిన అధికారులు సామగ్రిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మెషిన్ స్పేర్ పార్టులో ఉన్న 3.7 కిలోల బంగారం, ఐరన్ బాక్స్‌లో దాచి ఉంచిన మరో 3.29 కిలోల బంగారం బిస్కెట్లు బయటపడ్డాయి. బంగారాన్ని తీసుకొస్తున్న మహమ్మద్ కోయా, అబ్దుల్ రహీంలను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పట్టుబడిన బంగారం విలువ రూ.2 కోట్లు ఉంటుందని తెలిసింది.