ట్రంప్ ఆర్డర్తో రిస్కులో గూగుల్ ఉద్యోగులు
Published Sat, Jan 28 2017 4:31 PM | Last Updated on Tue, Sep 5 2017 2:21 AM
ముస్లిం దేశాలపై ఆంక్షలు విధిస్తూ ట్రంప్ తీసుకున్న ఇమ్మిగ్రేషన్ ఆర్డర్పై ఘాటైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దిగ్గజ కంపెనీల సీఈవోలందరూ ట్రంప్పై విరుచుకుపడుతున్నారు. ఫేస్బుక్ అధినేత జుకర్బర్గ్ అనంతరం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ ఆర్డర్పై విమర్శలు సంధించారు. ఏడు దేశాలకు చెందిన వారిని అమెరికాలోకి రాకుండా నిషేధం విధించడం పిచాయ్ తప్పుపట్టారు. ట్రంప్ ఆదేశాలు తమ ఉద్యోగులపై ప్రభావం చూపనున్నాయని తెలుపుతూ కంపెనీ స్టాఫ్కు ఓ ఈ-మెయిల్ రాశారు. దానిలో ట్రంప్ ఇమ్మిగ్రేషన్ ఆర్డర్ను విమర్శించారు.
187 మంది గూగుల్ ఉద్యోగులపై ఈ ఆర్డర్ ప్రభావం చూపనుందని పిచాయ్ పేర్కొన్నారు. ఈ ఆర్డర్తో చూపే ప్రభావంపై తాము చింతిస్తున్నామని, ట్రంప్ ఇమ్మిగ్రేషన్ ఆర్డర్తో తమ సహచరులకు తలెత్తే వ్యక్తిగత వ్యయాలు చాలా బాధకరమన్నారు. విదేశాలకు ట్రావెల్ చేసే గూగుల్ ఉద్యోగులు ట్రంప్ ఆదేశాలు అమల్లోకి వచ్చేలోపల అమెరికాకు వచ్చేయాలని పిచాయ్ ఆదేశించారు. గూగుల్ సెక్యురిటీ, ట్రావెల్, ఇమ్మిగ్రేషన్పై కంపెనీ సాయం చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కంపెనీల్లో పనిచేసే వారు, కేటాయించిన పనులపై విదేశాలకు వెళ్తూ ఉంటారు. ఒకవేళ వారిదగ్గర వాలిడ్ వీసా ఉన్నప్పటికీ వారు ప్రమాదంలో పడే అవకాశాలున్నాయని కంపెనీ ఉద్యోగులకు హెచ్చరిస్తోంది.
శుక్రవారం ట్రంప్ ఇమ్మిగ్రేషన్ ఆర్డర్పై సంతకం చేశారు. ముస్లిం మెజారిటీ ఏడు దేశాలు ఇరాన్, ఇరాక్, లిబియా, సోమాలియా, సుడాన్, సిరియా, యెమెన్లకు చెందిన పౌరులను అమెరికాలోకి రాకుండా ఆంక్షలు విధించారు. ఈ దేశాలకు చెందిన పౌరులకు 90 రోజుల వరకు వీసాల జారీ నిలిపేస్తారు. అమెరికాలోని శరణార్థుల పునరావాస కార్యక్రమం కనీసం 120 రోజుల పాటు ఆపేస్తారు. ఈ ఏడు దేశాలకు చెందిన వారిదగ్గర గ్రీన్ కార్డు ఉన్నా.. వారిని అమెరికాలోకి రానిస్తారో లేదో అన్నది ప్రస్తుతం సందేహంగా మారింది.
Advertisement