Immigration Order
-
బ్రిటన్ కొత్త వీసాకు తుదిమెరుగులు
లండన్: ఈయూ నుంచి వైదొలగిన బ్రిటన్ బ్రెగ్జిట్ పాయింట్స్ బేస్డ్ వీసా, ఇమిగ్రేషన్ వ్యవస్థ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. దీనికి సంబంధించిన వ్యవహారాలకు ప్రధాని బోరిస్ జాన్సన్, హోంమంత్రి ప్రీతి పటేల్‌లు తుదిమెరుగులు దిద్దినట్లు అధికారులు తెలిపారు. దీని ద్వారా నిపుణులను భారత్ సహా ప్రపంచ నలుమూలల నుంచి రప్పించుకోవచ్చని ఆ దేశం భావిస్తోంది. గత వారం జరిగిన సమావేశంలో యూకే మైగ్రేషన్ అడ్వైజరీ కమిటీ సూచించిన సలహాలను ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకుంది. ఇందులోనే కనీస వేతనాలు సంబంధించిన వివరాలున్నాయి. నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగావకాశాలను కల్పించేందుకు అవసరమైన ప్రతిపాదనలు కూడా అందులో ఉన్నాయి. గురువారం మంత్రివర్గ విస్తరణ జరగనుండగా, శుక్రవారం వీసాల వ్యవహారానికి సంబంధించిన వివరాలను ప్రీతి పటేల్ వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిపుణుల రంగంలో యూకే వీసాల్లో అత్యధికులు భారతీయులే ఉన్నారు. గతేడాదిలో 56 వేలకు పైగా టైర్–2 వీసాలను యూకే ఇచ్చింది. బ్రెగ్జిట్ వల్ల ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. -
ట్రంప్ వాదనలో నిజమెంత ?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు ఆదినుంచి వివాదాస్పదమే. అధ్యక్షుడి హోదాలో ఆయన చేసే ప్రకటనల్లో నిజం కూడా నేతి బీరకాయలో నెయ్యి చందంగానే మారుతోంది. శరణార్థుల పేరు చెబితే అంతెత్తున లేస్తున్న ట్రంప్ అమెరికా వలస విధానంపైనా, మెక్సికో సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపైనా తాజా ప్రకటనలన్నీ తప్పుడు తడకలే. వలసవాదులు వాళ్లు చేస్తున్న నేరాలపై ఈ మధ్య కాలంలో ట్రంప్ చేసిన ప్రకటనలేంటి ? వాటి వెనుకనున్న వాస్తవాలేంటి ? వలస న్యాయమూర్తులపై ట్రంప్ : అక్రమంగా వలస వచ్చిన వారి విచారణకు వేలకు వేల మంది న్యాయమూర్తులున్నారు. పనికిమాలిన వలస చట్టాల కారణంగా వారిని నియమించాల్సి వస్తోంది. ఇక మా చట్టాలను మార్చేస్తాం. సరిహద్దుల్లో గోడలు కట్టేస్తాం. అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తే ఇక కోర్టులు, కేసులు ఉండవు. వెనక్కి తిరిగి పంపేస్తాం. వాస్తవం : అక్రమ వలస కేసుల్ని విచారించానికి వేలాది మంది న్యాయమూర్తులు ఉన్నారన్నది పూర్తిగా తప్పు. ఈ విచారణకు ఉద్దేశించిన కోర్టుల్లో దేశవ్యాప్తంగా 335 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారు. 150 మంది అదనపు న్యాయమూర్తుల నియామకానికి బడ్జెట్ ఉంది. ఇంకా ఏడు లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్ కేసులన్నీ పూర్తి కావాలంటే ఒక్కో న్యాయమూర్తి 2 వేలకు పైగా కేసుల్ని విచారించాల్సి ఉంది. తల్లీ బిడ్డల్ని వేరు చేయడంపై ట్రంప్: అత్యంత అమానవీయంగా సరిహద్దుల్లో తల్లీ బిడ్డల్ని వేరు చేయడంపై విమర్శలు వెల్లువెత్తడంతో వెనక్కి తగ్గిన ట్రంప్ జీరో టాలరెన్స్ విధానానికి స్వస్తి పలికే ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై సంతకం చేస్తూ .. ఇకపై మేము కుటుంబాల్ని కలిపే ఉంచుతాం. దీంతో సమస్య పరిష్కారమైపోతోందని వ్యాఖ్యానించారు. వాస్తవం : వలసదారుల సమస్యలు ఎంత మాత్రం పరిష్కారం కావు. వారిపై కేసుల విచారణ ముగిసేవరకు తల్లీబిడ్డల్ని వేర్వేరుగా బదులుగా ఒకే చోట నిర్బంధించి ఉంచుతారు. అంతేకాదు అక్రమంగా దేశంలోకి ప్రవేశించే వ్యక్తుల నుంచి వారి పిల్లలను 20 రోజులకు మించి వేరు చేసి ఉంచకూడదని 1997 నాటి ఫ్లోర్స్ ఒప్పందం చెబుతోంది. అమెరికన్ కాంగ్రెస్ లేదంటే అక్కడి కోర్టులు ఏదో ఒక నిర్ణయం తీసుకునే వరకు ఈ 20 రోజుల విధానం అమల్లోనే ఉంటుందని న్యాయశాఖ స్పష్టం చేసింది. దాని ప్రకారం చూస్తే ప్రభుత్వ అధికారులకు మూడు వారాల తర్వాత మళ్లీ తల్లీ బిడ్డల్ని బలవంతంగా వేరు చేయడానికి అన్ని అధికారాలు సంక్రమిస్తాయి. వలసదారుల అరెస్టులపై ట్రంప్ : 2011 ప్రభుత్వ నివేదిక ప్రకారం హత్యా నేరం కింద 25 వేల మంది, దోపిడి కేసులో 42 వేల మంది, లైంగిక నేరాల్లో 70 వేల మంది, కిడ్నాప్ కేసుల్లో 15 వేల మంది అక్రమవలదారుల అరెస్టులు జరిగాయి. గత ఏడేళ్లుగా కేవలం టెక్సాస్‌లోనే రెండున్నర లక్షల మంది అక్రమ వలసదారుల్ని అరెస్ట్ చేశాం. వారిపై ఆరులక్షలకు పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వాస్తవం: అక్రమ వలసదారుల అరెస్టులపై ప్రభుత్వ అధికారిక గణాంకాలు, నివేదికలో అంశాలనే ట్రంప్ ప్రస్తావించారు. సరిహద్దులు దాటుకొని వచ్చిన నేరగాళ్లలో 30 లక్షల మందికి పైగా జరిగిన అరెస్టులు వాస్తవమే కానీ, అందులో సగానికిపైగా అక్రమవలస, మాదకద్రవ్యాలు, ట్రాఫిక్ నేరాల కింద జరిగాయి. చాలా వరకు కేసులు పౌర చట్టాల అతిక్రమణలకు సంబంధించిన కేసులే తప్ప, క్రిమినల్ అభియోగాలు కాదు. వలసదారుల నేరాలపై ట్రంప్ : ఎప్పుడూ నా చెవుల్లో ఒక మాట వినపడుతూ ఉంటుంది. అమెరికా పౌరుల కంటే వాళ్లు (వలస వచ్చిన వారు) మంచివాళ్లు అని.. అదెంత మాత్రం సరైంది కాదు. వాళ్లే అధిక నేరాలు చేస్తున్నారు. వాళ్లున్న చోటే శాంతి భద్రతల సమస్య తలెత్తుతోంది. వాస్తవం : అమెరికాలో వివిధ సామాజిక సంస్థలు, కాటో ఇనిస్టిట్యూట్ వంటి మేధో సంస్థల గణాంకాల ప్రకారం అమెరికా పౌరులతో పోల్చి చూస్తే వలసదారులు చేసే నేరాల సంఖ్య చాలా తక్కువ. 1990 సంవత్సరం నుంచి 2014 వరకు గణాంకాలను పరిశీలిస్తే వలసదారులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో క్రైమ్ రేటు చాలా తక్కువగా నమోదైంది. అత్యధిక వలసదారుల జనాభా ఉన్న న్యూయార్క్ నగరంలో (5 లక్షల మంది వరకు అక్రమంగా ఉన్నారని అంచనా) గత ఏడాది 292 హత్యలు జరిగాయి. అమెరికాలో ఎన్ని హత్యలు జరిగాయన్నదానిపైనే శాంతి భద్రతల్ని అంచనా వేస్తారు. అలా చూస్తే వలస వచ్చిన వారు స్థిరపడిన ప్రాంతాల్లోనే హత్యలు తక్కువగా జరిగాయి. ఆర్థిక వ్యవస్థకు వాళ్లే ఆలంబన గత ఏడాది ఫిబ్రవరిలో అమెరికా ‘ వలసదారులు లేకుండా ఒక్కరోజు‘ పేరుతో ఇమిగ్రెంట్స్ అందరూ 24 గంటల సమ్మెకు దిగేసరికి అమెరికా వణికి పోయింది. రెస్టారెంట్లు, నిర్మాణ కంపెనీలు, ఇతర వాణిజ్య కేంద్రాల్లో వలస వచ్చిన వారుపనికి హాజరుకాకపోయేసరికి ఆ ఒక్క రోజే దుకాణాలు మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వలసదారుల శ్రమ లేకపోతే అమెరికా ఆర్థిక వ్యవస్థే కుప్పకూలిపోతుందని కొన్ని స్వతంత్ర సంస్థలు చెబుతున్నాయి. అమెరికా పౌరులు వలస వచ్చిన వారిని ఎంత చిన్న చూపు చూసినా రెస్టారెంట్లలో వంటలు చెయ్యడానికీ మెక్సికన్లు కావాలి, వ్యవసాయ క్షేత్రాల్లోపని చేయడానికి వాళ్ల సహకారమే ఉండాలి. అమెరికన్ల ఇళ్లు శుభ్రం చేయాలన్న, గిన్నెలు తోమాలన్నా, తోటల్లో మాలీలుగానైనా, పిల్లల్ని సంరక్షించాలన్నా మెక్సికన్లే దిక్కు అని అమెరికాలోని ప్రముఖ షెఫ్ ఆంథోని బౌర్డెన్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా సేవారంగంలో వసలదారులే ఎక్కువగా ఉన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు అమెరికన్ల ఉద్యోగాలు కాజేస్తున్నారని అందరూ గగ్గోలు పెడుతున్నారు కానీ, గత రెండు దశాబ్దాల్లో రెస్టారెంట్లలో వంటలు, డిష్ వాషింగ్ వంటి ఉద్యోగాల కోసం ఒక్క అమెరికన్ కూడా ముందుకు రాలేదు. మెక్సికన్లు అంటూ లేకపోతే అమెరికాలో సేవా రంగం కుదేలైపోతుందని ఆంథోని చెబుతున్నారు. అమెరికన్ రెస్టారెంట్లలో 75 శాతం వలసదారులే పని చేస్తున్నారు. ఇక వ్యవసాయ రంగంలో కూడా అత్యధికులు వలసదారులేనని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ చదవండి: ట్రంప్ అభిశంసనకు 42 శాతం మొగ్గు -
అర్హతల ఆధారంగానే వలసలకు అనుమతి
వాషింగ్టన్: అర్హతల ఆధారంగానే వలసలను అనుమతిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అనధికారికంగా ఎవరూ దేశంలోకి ప్రవేశించకుండా సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తామన్నారు. కఠిన వలస విధానాలపై ఇంటాబయటా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రతిపక్ష డెమోక్రాట్లు, మీడియా తీరుపైనా ఆయన విరుచుకుపడ్డారు. అక్రమ వలసదారుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను, బాధితులను శనివారం ట్రంప్ వైట్‌హౌస్‌లో కలుసుకుని మాట్లాడారు. దేశ సరిహద్దులతోపాటు పౌరులకు కూడా భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమన్నారు. ఇతర దేశాల వారు ఇక్కడికి రావడాన్ని కోరుకుంటున్నామనీ, అయితే, అది పద్ధతి ప్రకారం మాత్రమే జరగాలన్నారు. ‘సమర్థత ఆధారంగానే వలసలను కోరుకుంటున్నాం. అంతేకానీ, అనర్హులకు కూడా అనుమతి ఇచ్చే డ్రా విధానాన్ని మాత్రం కాదు’ అని ‘యాంజెల్ ఫ్యామిలీస్’గా పేర్కొనే బాధిత కుటుంబాలతో అన్నారు. ‘విదేశీ నేరగాళ్ల కారణంగానే దేశంలో నేరాల రేటు పెరుగుతోంది. బాధిత కుటుంబాల ఇబ్బందులపై చర్చించటానికి ప్రతిపక్ష డెమోక్రాట్లతోపాటు, బలహీన వలస విధానాలను బలపరిచే కొందరు ఇష్టపడడం లేదు’ అని ట్రంప్ ఆరోపించారు. 2011 గణాంకాల ప్రకారం విదేశీ నేరగాళ్ల కారణంగా దేశంలో 25వేల హత్యలు, 42వేల దోపిడీలు, 70వేల లైంగిక నేరాలు, 15వేల కిడ్నాప్‌లు జరిగాయని తెలిపారు. గత ఏడేళ్లలో ఒక టెక్సస్‌లోనే 6 లక్షల నేరాలకు సంబంధించి 2.5లక్షల మందిని అరెస్ట్ చేశామన్నారు. ‘హెరాయిన్ అతిగా తీసుకున్న కారణంగా కేవలం 2016లోనే 15వేల మంది చనిపోయారు. దేశంలోకి అక్రమంగా సరఫరా అయ్యే హెరాయిన్‌లో 90 శాతం దక్షిణ సరిహద్దుల నుంచే వస్తోంది’ అని అన్నారు. 2017లో అరెస్టయిన 8 వేల మంది విదేశీ నేరగాళ్లను బలహీన చట్టాల కారణంగానే విడిచి పెట్టాల్సి వచ్చిందన్నారు. ‘ప్రజలను చంపేస్తోన్న డ్రగ్స్ సరఫరాదారులను పట్టుకుని వదిలి పెడుతుంటే ఈ మీడియా ఏం చేస్తోంది’ అని ప్రశ్నించారు. అక్రమ వలస నేరగాళ్ల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు, ఇబ్బందులు పడిన వారికి సాయ పడేందుకు ‘వాయిస్’ అనే విభాగాన్ని ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా ట్రంప్ 2017లో ఏర్పాటు చేశారు. -
అమెరికాకు ట్రంప్ ఆదేశాల దెబ్బ
వాషింగ్టన్ : ఇస్లామిక్ ఉగ్రవాదులను అమెరికాలోకి ప్రవేశించకుండా అరికట్టేందుకు ఏడు ముస్లిం దేశాలపై నిషేధం.. అమెరికన్ ఉద్యోగాలు అమెరిక్లకేనంటూ హెచ్-1బీ వీసాలపై కొరడా ఆ దేశ ఆర్థికవ్యవస్థకు ప్రతికూలంగా మారబోతున్నాయట. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో మళ్లీ అమెరికా ఎకానమీ కుదేలయ్యే స్థాయికి వెళ్లిపోతుందని ఆర్థికవేత్తలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దేశానికి టాప్ ఇండస్ట్రియల్ ఎక్స్పోర్టులుగా ఉన్న టూరిజం, ఉన్నతవిద్యపై దెబ్బకొట్టడం అమెరికా ఆర్థికవ్యవస్థ మందగిస్తుందని పేర్కొంటున్నారు. అమెరికాకు మళ్లీ ఉద్యోగాలు తీసుకురావడం అనే నెపంతో స్కిల్ స్పెక్ట్రమ్ వీసా కేటగిరీపై నిబంధనలు విధించడం వల్ల ఏం సాధించలేరని సౌత్ ఆసియా అమెరికన్స్ లీడింగ్ టుగెథర్ సుమన్ రఘునాథన్ చెప్పారు. హెచ్-1బీ వీసా సవరణలు, ఇతర ట్రంప్ ఆదేశాలు అమెరికా ఎకానమీని కుదుటపడేలా చేయలేవన్నారు. మరోవైపు మెక్సికో సరిహద్దులో గోడ నిర్మించడం, ఏడు దేశాలపై నిషేధం విధించడం అమెరికాను సందర్శించే ఇతర దేశాల పర్యాటకులపైన, విద్యార్థులపైన ప్రభావం చూపనుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఈ ఆదేశాలు కేవలం ఏడు దేశాలకే పరిమితం కావంటున్నారు. వస్తువులు, సర్వీసుల రూపంలో జరిగే గ్లోబల్ ఎక్స్చేంజ్ పాజిటివ్ అంశాలకు ట్రంప్ దెబ్బతీస్తున్నారని విమర్శలు వెల్లువెత్తున్నాయి. అమెరికా ఎకానమీకి విదేశీ పర్యాటకులే ఎంతో కీలకమైన మద్దతు అందిస్తున్నారు. 2015లో వీరి నుంచి 199 బిలియన్ డాలర్ల(రూ.13,40,464కోట్లకు పైగా) ఆదాయం చేకూరింది. ట్రావెల్, టూరిజం అమెరికా ఎక్స్పోర్టులో 9 శాతముంటోంది. కానీ ట్రంప్ ఆదేశాలు ఈ ఎక్స్‌పోర్టులపై దెబ్బకొడుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. అంతేకాక 9/11 పేలుళ్ల సమయంలో నెలకొన్న వాతావరణాన్ని ట్రంప్ ఆర్డర్లు సృష్టిస్తున్నాయని పలువురు ఆర్థికవేత్తంటున్నారు. కఠినతరమైన నిబంధనలతో అమెరికాకు వచ్చే సందర్శకుల సంఖ్య తగ్గుతుందన్నారు. ఈ మెసేజ్ అమెరికా అన్ఫ్రెండ్లీ కంట్రీగా మారబోతుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. -
ట్రంప్ ఆర్డర్‌తో రిస్కులో గూగుల్ ఉద్యోగులు
ముస్లిం దేశాలపై ఆంక్షలు విధిస్తూ ట్రంప్ తీసుకున్న ఇమ్మిగ్రేషన్ ఆర్డర్‌పై ఘాటైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దిగ్గజ కంపెనీల సీఈవోలందరూ ట్రంప్‌పై విరుచుకుపడుతున్నారు. ఫేస్బుక్ అధినేత జుకర్‌బర్గ్ అనంతరం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ ఆర్డర్‌పై విమర్శలు సంధించారు. ఏడు దేశాలకు చెందిన వారిని అమెరికాలోకి రాకుండా నిషేధం విధించడం పిచాయ్ తప్పుపట్టారు. ట్రంప్ ఆదేశాలు తమ ఉద్యోగులపై ప్రభావం చూపనున్నాయని తెలుపుతూ కంపెనీ స్టాఫ్‌కు ఓ ఈ-మెయిల్ రాశారు. దానిలో ట్రంప్ ఇమ్మిగ్రేషన్ ఆర్డర్‌ను విమర్శించారు. 187 మంది గూగుల్ ఉద్యోగులపై ఈ ఆర్డర్ ప్రభావం చూపనుందని పిచాయ్ పేర్కొన్నారు. ఈ ఆర్డర్‌తో చూపే ప్రభావంపై తాము చింతిస్తున్నామని, ట్రంప్ ఇమ్మిగ్రేషన్ ఆర్డర్‌తో తమ సహచరులకు తలెత్తే వ్యక్తిగత వ్యయాలు చాలా బాధకరమన్నారు. విదేశాలకు ట్రావెల్ చేసే గూగుల్ ఉద్యోగులు ట్రంప్ ఆదేశాలు అమల్లోకి వచ్చేలోపల అమెరికాకు వచ్చేయాలని పిచాయ్ ఆదేశించారు. గూగుల్ సెక్యురిటీ, ట్రావెల్, ఇమ్మిగ్రేషన్‌పై కంపెనీ సాయం చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కంపెనీల్లో పనిచేసే వారు, కేటాయించిన పనులపై విదేశాలకు వెళ్తూ ఉంటారు. ఒకవేళ వారిదగ్గర వాలిడ్ వీసా ఉన్నప్పటికీ వారు ప్రమాదంలో పడే అవకాశాలున్నాయని కంపెనీ ఉద్యోగులకు హెచ్చరిస్తోంది. శుక్రవారం ట్రంప్ ఇమ్మిగ్రేషన్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ముస్లిం మెజారిటీ ఏడు దేశాలు ఇరాన్, ఇరాక్, లిబియా, సోమాలియా, సుడాన్, సిరియా, యెమెన్లకు చెందిన పౌరులను అమెరికాలోకి రాకుండా ఆంక్షలు విధించారు. ఈ దేశాలకు చెందిన పౌరులకు 90 రోజుల వరకు వీసాల జారీ నిలిపేస్తారు. అమెరికాలోని శరణార్థుల పునరావాస కార్యక్రమం కనీసం 120 రోజుల పాటు ఆపేస్తారు. ఈ ఏడు దేశాలకు చెందిన వారిదగ్గర గ్రీన్ కార్డు ఉన్నా.. వారిని అమెరికాలోకి రానిస్తారో లేదో అన్నది ప్రస్తుతం సందేహంగా మారింది.