భారత స్వాంతత్ర్య దినోత్సవం సందర్భంగా 'గూగుల్ ఇంపాక్ట్ ఛాలెంజ్' పేరుతో గూగుల్ ఓ పోటీ నిర్వహిస్తోంది.
భారత స్వాంతత్ర్య దినోత్సవం సందర్భంగా 'గూగుల్ ఇంపాక్ట్ ఛాలెంజ్' పేరుతో గూగుల్ ఓ పోటీ నిర్వహిస్తోంది. ఇది అలాంటి ఇలాంటి పోటీ కాదు.. ఏకంగా మూడుకోట్ల రూపాయల బహుమతి మూటగట్టి మరీ ఇచ్చే పోటీ. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా దూసుకుంటూ ముందుకెళ్లండి. ఇంతకీ విషయం ఏమిటంటే, భారతదేశంలో ప్రజల జీవితాలను బాగుచేయడానికి సాంకేతిక పరిజ్ఞానం ఎంతవరకు ఉపయోగపడుతుందో మన దేశంలోని స్వచ్ఛంద సంస్థలు చెప్పాలన్నమాట. అంటే, పూర్తిగా అర్థమైంది కదూ. ఆ మూడు కోట్ల రూపాయలను జేబులో వేసుకోవడం కాదు.. మీ స్వచ్ఛంద సంస్థ తరఫున దేశాన్ని బాగుచేయడానికి, దేశవాసుల జీవితాలను బాగుచేయడానికి మంచి ప్రాజెక్టుకు రూపకల్పన చేసి, దానికి ఉపయోగించాలన్నమాట. అంతేకాదు, అలాంటి ప్రాజెక్టులకు గూగుల్ నుంచి సాంకేతిక సాయం కూడా అందుతుంది.
ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం స్వాతంత్ర్య దినోత్సం జరుపుకొంటున్న సందర్భంగా సృజనాత్మకత వెల్లి విరియాలని, దేశంలోని మంచి స్వచ్ఛంద సంస్థలను గుర్తించి, వారికి సాంకేతిక సాయం అందించడం ద్వారా ఈ ప్రపంచాన్ని మెరుగుపరచాలన్నదే తమ ఉద్దేశమని గూగుల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ నికేష్ అరోరా ఓ బ్లాగ్ పోస్టులో తెలిపారు.
సెప్టెంబర్ 5వ తేదీ వరకు భారతదేశంలో నమోదైన స్వచ్ఛంద సంస్థలు ఆన్లైన్లో ఈ పోటీకి దరఖాస్తు చేసుకోవచ్చని అరోరా చెప్పారు. భారత దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గూగుల్ అధికారులు ఈ దరఖాస్తులను పరిశీలించి, అక్టోబర్ 21 నాటికల్లా పది అత్యుత్తమమైన ప్రాజెక్టులను ఎంపిక చేస్తారు. తర్వాత అక్టోబర్ 31న ఈ పది మంది మధ్య పోటీ ఉంటుంది. వీళ్ల నుంచి ముగ్గురిని ఎంపిక చేస్తారు. వారికి ఒక్కొక్కరికి మూడేసి కోట్ల రూపాయల బహుమతి అందజేస్తారు.