గూగుల్ కారు రెడీ అవుతోంది..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజం గూగుల్ రూపొందిస్తున్న సెల్ఫ్ డ్రైవింగ్ కారు సిద్ధమవుతోంది. 2020 నాటికి మార్కెట్లోకి వస్తోంది. డ్రైవర్ అవసరం లేని ఈ కారును అయిదేళ్లలో ప్రవేశపెట్టేందుకు తమ సిబ్బంది కృషి చేస్తున్నారని గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల విభాగం అధిపతి క్రిస్ ఉర్మ్‌సన్ తెలిపారు. కెనడాలోని వాంకోవర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలు తగ్గాలంటే డ్రైవర్ లేని కార్లతోనే సాధ్యమని స్పష్టం చేశారు. ‘భద్రత పరంగా అత్యాధునిక టెక్నాలజీతో కార్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇవి కొంత వరకు మాత్రమే ప్రయాణికులకు రక్షణ కల్పిస్తాయి. అన్ని సందర్భాల్లోనూ కాదు. సెల్ఫ్ డ్రైవింగ్ కారు విషయంలో అలాంటి సమస్యే లేదు’ అని చెప్పారు. అయితే తొలుత అమెరికా వంటి అగ్ర దేశాలకే ఈ కారు పరిమితం అవుతుంది.
పోటీలో ఆపిల్ కూడా..
మరో టెక్నాలజీ సంస్థ ఆపిల్ సైతం సెల్ఫ్ డ్రైవింగ్ కారును తయారు చేస్తున్నట్టు సమాచారం. ఈ సంస్థ కూడా 2020 నాటికే కారును విడుదల చేయాలని కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ఇద్దరు మాత్రమే ప్రయాణించే సెల్ఫ్ డ్రైవింగ్ కారు పూర్తిగా సాఫ్ట్‌వేర్ నియంత్రణలో రాడార్, సెన్సర్ల ఆధారంగా పనిచేస్తుంది. పరిసరాలను రాడార్ ఎప్పటికప్పుడు 3డీ చిత్రాల రూపంలో పంపిస్తుంది. ఇక స్మార్ట్‌ఫోన్‌తో కారు అనుసంధానమై ఉంటుంది. ఫోన్ ద్వారా రావాల్సిన, వెళ్లాల్సిన ప్రాంతం ఏమిటో ఆదేశిస్తే చాలు తన పని తాను చేసుకుపోతుంది. కారులో కూర్చున్నాక స్టార్ట్ బటన్ నొక్కగానే బయలుదేరుతుంది. అత్యవసర పరిస్థితుల్లో ఆగాల్సి వస్తే రెడ్ బటన్ నొక్కితే చాలు. స్టీరింగ్, పెడల్స్ ఏవీ ఉండవు.