ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం తీరిగ్గా ఇది ఎందుకు జరుగుతోందో పరిశీలిస్తోంది!!
ఒకపక్క ఉల్లిపాయలు కిలో 50 రూపాయలు.. బియ్యం 50-60 రూపాయల మధ్యనే. పప్పులు, ఉప్పులు అన్నింటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏం చేస్తోందో తెలుసా.. తీరిగ్గా ఇది ఎందుకు జరుగుతోందో పరిశీలిస్తోంది!! ఈ విషయాన్ని కేంద్ర ఆహార శాఖ మంత్రి కేవీ థామస్ స్వయంగా వెల్లడించారు.
ఆహార ధాన్యాల ఉత్పత్తి చాలా బాగున్నా.. ధరలు ఎందుకు పెరుగుతున్నాయో, ఆహార ద్రవ్యోల్బణం ఎందుకు వస్తోందో పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆగస్టులో ఆహార ద్రవ్యోల్బణం ఏకంగా 18.18 శాతానికి పెరిగిపోయింది. సాధారణ ద్రవ్యోల్బణం కూడా 6.1 శాతానికి పెరిగింది. ఆహారధాన్యాల ఉత్పత్తి, నిల్వ గత కొన్నేళ్లుగా బాగానే ఉన్నా, ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయని, దాన్ని తాము విశ్లేషిస్తున్నామని ఆయన చెప్పారు. ధరలు పెరగడానికి కారణమేంటో తెలుసుకుంటామని ఆయన చెప్పారు. రోలర్ ఫ్లోర్ మిల్లర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 73వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన ఈ విషయాలు తెలిపారు. బియ్యం విషయంలో డబ్ల్యుపిఐ ద్రవ్యోల్బణం ఏకంగా 20.13 శాతం ఉంది. గోధుమల విషయంలో ఇది 7.6 శాతమే.