
అంతర్జాతీయ తయారీ కేంద్రంగా భారత్
చైనాలో వేతన భారం పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ తయారీ కేంద్రంగా ఎదగడానికి భారత్‌కు
పెట్టుబడులకు అనువైన పరిస్థితులు
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ: చైనాలో వేతన భారం పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ తయారీ కేంద్రంగా ఎదగడానికి భారత్‌కు అపార అవకాశాలు ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఇందుకోసం అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని శుక్రవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో పుష్కలంగా మానవ వనరులు, వివిధ శిక్షణా సంస్థలు ఉన్నాయని.. పెట్టుబడి వ్యయాలు హేతుబద్ధమైన స్థాయిలోనే ఉండేందుకు ఇవి దోహదపడగలవని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం సంపన్న దేశాలతో పోలిస్తే భారత స్థూల దేశీయోత్పత్తిలో తయారీ రంగం వాటా చాలా తక్కువగానే ఉందని..
దీన్ని మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందని జైట్లీ తెలిపారు. ఇటు పన్నులపరంగాను, అటు వ్యాపారాల నిర్వహణ సులభతరం చేసేదిగాను పెట్టుబడులకు అనుకూల పరిస్థితులు కల్పించేందుకు కొత్త ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. దేశీ ఎకానమీపై ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి, దేశీ..విదేశీ పెట్టుబడులకు ఊతమిచ్చేలా నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. వచ్చే నెల 20న మొదలయ్యే రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) సవరణల బిల్లు ఆమోదం పొందగలదని చెప్పారు.
ప్లాస్టిక్ కరెన్సీ వాడకం పెరగాలి..
నల్లధనం సమస్యను అరికట్టేందుకు కరెన్సీ వాడకం తగ్గేలా.. చెక్కులు, ప్లాస్టిక్ కరెన్సీ వాడకం పెరిగేలా చూడాల్సిన అవసరం ఉందని జైట్లీ చెప్పారు. దీని వల్ల లెక్కల్లో చూపని సొమ్మును వెలికితీయడం సాధ్యపడగలదని సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌పీఎంసీఐఎల్) వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు. మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మెరుగుపడి.. త్వరలోనే ముడి చమురు రేట్లు స్థిరపడగలవని ఆయన అభిప్రాయపడ్డారు.