మహానేత వైఎస్ఆర్ కు జననేత, కుటుంబ సభ్యుల ఘన నివాళి
మహానేత వైఎస్ఆర్ కు జననేత, కుటుంబ సభ్యుల ఘన నివాళి
Published Wed, Oct 2 2013 2:35 AM | Last Updated on Sat, Jul 7 2018 2:52 PM
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయను సందర్శించారు. ఉదయం 9.15 సమయంలో వైఎస్సార్ ఘాట్‌కు చేరుకున్న జగన్ తండ్రి సమాధిపై పూలమాలలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి కుటుంబ సమేతంగా ఘన నివాళులర్పించారు. చాలాకాలం తర్వాత ఇడుపులపాయకు రావడంతో ఘాట్‌వద్దకు రాగానే జగన్ ఉద్వేగానికి లోనయ్యారు. సమాధి వద్ద మోకాళ్లపైనే కాసేపు మౌనంగా ఉండిపోయారు. ఆ సమయంలో అక్కడ గంభీర వాతావరణం నెలకొంది. జగన్‌తో పాటు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, వైఎస్ వివేకానందరెడ్డి తదితరులు మహానేతకు నివాళులర్పించారు. తర్వాత అక్కడే ఉన్న వైఎస్ కాంస్య విగ్రహానికి కూడా పూలమాలలు వేశారు.
ఎస్టేట్ చర్చి ఫాదర్ నరేష్ ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఇడుపులపాయలోని అతిథిగృహానికి చేరుకున్న జగన్ పలుదఫాలుగా అభిమానులను పలకరించారు. ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. వాస్తవానికి చాలాకాలం తర్వాత వచ్చిన తమ అభిమాన నేతను చూసేందుకు జిల్లా ప్రజానీకం ఉదయం నుంచే పోటెత్తింది. వర్షపు తుంపర్లు కూడా జననేతను స్వాగతించాయి. జగన్ మంగళవారం తెల్లవారుజామున 4.45 గంటలకు వైఎస్సార్ జిల్లా ఎరగ్రుంట్ల రైల్వేస్టే„షన్‌కు చేరుకున్నారు. సోమవారం రాత్రి నుంచే పార్టీ కార్యకర్తలు, అభిమానులు స్టేషన్‌లో జాగారం చేస్తూ గడిపారు. ఉదయానికల్లా భారీ సంఖ్యలో అభిమానులు, మహిళలు తరలివచ్చారు. వారందరినీ జగన్ పలుకరించారు.
ఎరగ్రుంట్ల నుంచి వీరపునాయునిపల్లి మీదుగా ఇడుపులపాయకు చేరుకున్న జగన్‌కు మధ్యలో ప్రతి పల్లె స్వాగతం పలికింది. ఇడుపులపాయ గెస్‌టహౌస్ వద్ద కార్యకర్తలు, అభిమానుల రద్దీతో గేటునుంచి వాహనం కూడా లోపలికి వెళ్లడం కూడా కష్టమైంది. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ జగన్ నడుచుకుంటూనే లోపలికి వెళ్లారు. ఇలా ఉదయం నుంచి రాత్రి వరకూ క్షణం తీరిక లేకుండా అభిమానుల మధ్యనే జననేత గడిపారు. రాత్రి 8.30 గంటలకు ఇడుపులపాయ నుండి బయలుదేరి ముద్దనూరు రైల్వేస్టే„షన్‌కు చేరుకున్నారు. అక్కడినుంచి వెంకటాద్రి ఎక్‌సప్రెస్‌లో రాజధానికి తిరుగు పయనమయ్యారు. ఈ సమయంలోనూ జగన్ చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు.
Advertisement
Advertisement