గ్రేటర్ నోయిడాలో ఆఫ్రికన్లపై దాడి దురదృష్టకరమని విదేశాంగ శాఖ పేర్కొంది.
న్యూఢిల్లీ: గ్రేటర్ నోయిడాలో ఆఫ్రికన్లపై దాడి దురదృష్టకరమని విదేశాంగ శాఖ పేర్కొంది. విదేశీయుల భద్రతకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. నైజీరియా హైకమిషనర్ తో విదేశాంగ సహాయ మంత్రి ఎంజే అక్బర్ మాట్లాడారని వెల్లడించింది. నైజీరియా పౌరుల రక్షణకు స్థానిక అధికారులు తీసుకుంటున్న చర్యలను వివరించారని విదేశాంగ శాఖ తెలిపింది.
నైజీరియన్లపై జరిగింది విద్వేష దాడి కాదని గౌతమ్ బుద్ధ నగర్ డీఎం ఎన్పీ సింగ్ చెప్పారు. యువకుడి మరణానికి నైజీరియన్లు కారకులైయ్యారని కొంతమంది వదంతులు ప్రచారం చేయడంతో ఈ దాడి జరిగిందని తెలిపారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారని, వీరిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. దాడి నేపథ్యంలో పలువురు నైజీరియా ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. మరోవైపు కాస్నా పోలీస్ స్టేషన్ వెలుపల గ్రేటర్ నోయిడా పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.