ఇంటిపక్క కిరాణా కొట్టూ.. ఆన్‌లైన్‌లో | groceries online in the side of the house .. | Sakshi
Sakshi News home page

ఇంటిపక్క కిరాణా కొట్టూ.. ఆన్‌లైన్‌లో

Published Sat, Oct 3 2015 1:50 AM | Last Updated on Mon, Oct 22 2018 7:42 PM

ఇంటిపక్క కిరాణా కొట్టూ.. ఆన్‌లైన్‌లో - Sakshi

ఇంటిపక్క కిరాణా కొట్టూ.. ఆన్‌లైన్‌లో

కూరగాయల నుంచి కిరాణా సామాను వరకూ..
త్వరలోనే ‘పెప్పర్‌టాప్’లో మాంసాహారం కూడా..
10 నెలల్లో 47.2 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణ
నెల రోజుల్లో మరో 20 మిలియన్ డాలర్లు కూడా..
మొత్తం వ్యాపారంలో ఏపీ, తెలంగాణ వాటా 20 శాతం
కంపెనీ సహ వ్యవస్థాపకుడు నవ్‌నీత్ సింగ్ వెల్లడి

 
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో ఇపుడు ఆన్‌లైన్ షాపింగ్‌లో దొరకనిదంటూ ఏదీ లేదు! గుండు సూది నుంచి ఆకాశయానం వరకూ ప్రతి ఒక్కటీ కొనుగోలు చేయొచ్చు. కాకపోతే తమ ఉత్పత్తులను ఆన్‌లైన్ వేదికగా విక్రయించాలంటేనే మాత్రం కాస్త ఖర్చుతో కూడుకున్న పనే. వెబ్‌సైట్ డిజైనింగ్.. సాఫ్ట్‌వేర్ అభివృద్ధి.. పేమెంట్ గేట్ వే.. డెలివరీ వ్యవస్థ.. ఇలా చాంతాడంత పనుంటుంది. ఒక మోస్తరు వ్యాపార సంస్థలకైతే ఇది పెద్ద భారం కాకపోవచ్చు. కానీ, గల్లీలోని చిన్న చిన్న కిరాణా దుకాణాలూ ఆన్‌లైన్‌లో తమ ఉత్పత్తులను విక్రయించాలంటే... ఇది సాధ్యం కాకపోవచ్చు. అందుకే ఇలాంటి దుకాణాలకు వేదికను సృష్టించింది గుర్గావ్ కేంద్రంగా పనిచేస్తున్న పెప్పర్‌టాప్. కోడిగుడ్లు, కూరగాయల నుంచి మొదలుపెడితే ఇంట్లోకి అవసరమయ్యే కిరాణా సామాను వరకూ ప్రతి ఒక్కటీ ఆన్‌లైన్ వేదికగా కొనుగోలు చేయవచ్చంటున్నారు పెప్పర్‌టాప్ సహ వ్యవస్థాపకుడు నవ్‌నీత్ సింగ్. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే...
 గుర్గావ్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఐదేళ్లు.. ఆ తర్వాత లాజిస్టిక్ కంపెనీలో ఏడాది కాలం పనిచేశాక.. వ్యాపారం మీద ఉన్న ఇష్టంతో సొంతంగా కంపెనీ పెట్టాలని నిర్ణయించుకున్నా. ఆన్‌లైన్ షాపింగ్ అంటే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులో.. ఫ్యాషన్ వస్తువులో కాకుండా ఇంటి పక్కనే ఉన్న కిరాణా సామాను కూడా ఆన్‌లైన్‌లోకి తీసుకురావాలని భావించా. నా ఆలోచన మీద నమ్మకంతో కంపెనీ ప్రారంభించక ముందే 2013 నవంబర్‌లో సెకోయా క్యాపిటల్ 1.2 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. వీటితో కో-ఫౌండర్ మిలింద్ శర్మతో కలసి 2014 డిసెంబర్‌లో గుర్గావ్ కేంద్రంగా పెప్పర్‌టాప్.కామ్‌ను ప్రారంభించాం.

 త్వరలోనే మాంసాహార ఉత్పత్తులూ..
 ప్రస్తుతం పెప్పర్‌టాప్‌లో కోడిగుడ్ల నుంచి మొదలుపెడితే డ్రైఫ్రూట్స్, సేంద్రియ ఆహార ఉత్పత్తులు, పూజ సామాన్లు, పండ్లు, కూరగాయలు, పెట్ ఉత్పత్తులు, బేబీ కేర్, జుట్టు, చర్మ సౌందర్య ఉత్పత్తుల వంటివి సుమారు 1,500 రకాల ఉత్పత్తులు కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఇందులో 220 కిరాణా దుకాణాలు, 3 వేల మంది కస్టమర్లు రిజిస్టరయి ఉన్నారు. వచ్చే మార్చి నాటికి 500-700 దుకాణాలకు, 5-7 వేల మంది కస్టమర్లకు చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. త్వరలోనే పెప్పర్‌టాప్‌లో మాంసాహార ఉత్పత్తులనూ విక్రయిస్తాం.
 10 నెలల్లో 47.2 మిలియన్ డాలర్ల సమీకరణ...
 పెప్పర్‌టాప్ ప్రారంభమై 10 నెలలు కూడా పూర్తి కాలేదు. ఇప్పటికే 47.2 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. సీడ్ రౌండ్‌లో 1.2 మిలియన్ డాలర్లు, ఆ తర్వాత సిరీస్-ఏలో ఈ ఏడాది ఏప్రిల్‌లో 10 మిలియన్ డాలర్లు, సిరీస్-బీలో భాగంగా ఇటీవలే 36 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించాం. ఇందులో స్నాప్‌డీల్, సెకోయా ఇండియా, సైఫ్ పార్టరన్స్ సంస్థలు సమష్టిగా పెట్టుబడులు పెట్టాయి. మరో నెల రోజుల్లో మరో 20 మిలియన్ డాలర్ల పెట్టు బడులను సమీకరించనున్నాం.
 
 ఏపీ, తెలంగాణ వాటా 20 శాతం...

 పెప్పర్‌టాప్ మొత్తం వ్యాపారంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వాటా 20 శాతం వరకూ ఉంది. రోజుకు హైదరాబాద్ నుంచి 15 శాతం ఆర్డర్లొస్తున్నాయి. విశాఖపట్నం నుంచి రూ.6-7 వేలొస్తున్నాయి. ఆర్డరిచ్చిన రెండు గంటల్లోపు వస్తువులను డెలివరీ చేస్తాం. ప్రతి ఆర్డర్ మీద 7-8 శాతం చార్జీ కిరాణా దుకాణ యజమానిపై పడుతుంది. ప్రస్తుతం 2,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్న పెప్పర్‌టాప్‌లో ఆరు నెలల్లో 5,000 మందిని నియమించుకుంటాం.
 
 75 నగరాలకు విస్తరణ...

 ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇలా దేశవ్యాప్తంగా 17 నగరాల్లో సేవలందిస్తున్న పెప్పర్‌టాప్ వచ్చే మార్చి నాటికి దేశంలోని 75 నగరాలకు విస్తరించనుంది. ‘‘కంపెనీని ప్రారంభించిన తొలినాళ్లలో రోజుకు 30-40 ఆర్డర్లొచ్చేవి. కానీ, ఇప్పుడది 1,500-1,700కు చేరింది. వారాంతాల్లో అయితే ఏకంగా 40 వేల ఆర్డర్లొస్తున్నాయి. మొత్తం వ్యాపారంలో మొబైల్ ఆర్లర్లే ఎక్కువ. ఆండ్రాయిడ్ ఫోన్ల ద్వారా 85 శాతం, ఐఓఎస్ నుంచి 10 శాతం ఆర్డర్లొస్తున్నాయి. మిగతావి వెబ్‌సైట్ నుంచి వస్తున్నాయి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement