వృద్ధి లక్ష్యం 9-10 శాతం..
కొలంబియా వర్సిటీలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
న్యూయార్క్: భారత్ 9 నుంచి 10 శాతం శ్రేణిలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును నమోదుచేయాల్సిన అవసరం ఉందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. ఇదే స్థాయిలో దాదాపు పదేళ్లు వృద్ధి రేటు కొనసాగాలని ఆకాంక్షించారు. దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పేదరికం సమస్య పరిష్కారం దిశలో ఇది కీలకమని వివరించారు. ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి ఇక్కడకు వచ్చిన జైట్లీ, కొలంబియా యూనివర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ ఎఫైర్స్ విభాగం నిర్వహించిన ఒక సమావేశంలో ‘భారత్ ఆర్థిక వ్యవస్థ-ముందడుగు’ అన్న అంశంపై మాట్లాడారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...
ప్రస్తుత ఏడాది భారత్ వృద్ధి లక్ష్యం 8 శాతం. వచ్చే 10 ఏళ్లు, ఆ పైన 9 నుంచి 10 శాతం శ్రేణిలో జీడీపీ వృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఈ లక్ష్య సాధనపై తాను ఆశావహంగా ఉన్నానని సైతం ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఉదాహరణకు చైనాను తీసుకోండి. ఈ ఆసియా దేశం సగటున 30 సంవత్సరాలు దాదాపు 9 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. పలు రంగాల్లో వృద్ధి సాధించింది. మనమూ ఇదే బాటన నడవడానికి తగిన కృషి చేయాల్సి ఉంది.
మీరు పరిశ్రమల పక్షమా? లేద పేదల పక్షమా? అన్న అంశంపై భారత్‌లో రాజకీయ చర్చ సాగుతుంటుంది. ఈ రెండు అంశాల మధ్యా ఘర్షణాత్మక పరిస్థితి ఉంది. ఈ తరహా రాజకీయ చర్చను మొదట సరిదిద్దాల్సిన అవసరం ఉంది. అసలు ఇలాంటి చర్చ ఒకటి బయటకు రావడానికి గత ప్రభుత్వం చేసిన తప్పే కారణం. వనరుల పంపిణీపై వారు దృష్టి సారించలేదు. వృద్ధి రేటుకు ఊపునిచ్చే చర్యలనూ మర్చిపోయారు.
భారత్ ఉజ్వల ఆర్థిక భవిష్యత్తుకు విదేశీ పెట్టుబడులు ఎంతో అవసరం. పెట్టుబడులకు సంబంధించి దేశం అంతర్గత శక్తి భారీగా లేదు. ఈ విషయంలో బ్యాంకుల పరిస్థితి కూడా అంతంతే. అందువల్ల పెట్టుబడులు ఎక్కడి నుంచి భారీగా వచ్చే అవకాశం ఉందో... ఆయా దిశల వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఆయా పెట్టుబడులు దేశంలో మౌలిక రంగం అభివృద్ధికి, పేదరికం నిర్మూలనకు దోహదపడాలి. ఈ చర్యలన్నీ 9 నుంచి 10% వృద్ధి శ్రేణిలో దేశాన్ని నిలబెడతాయి.
సబ్సిడీలు లక్ష్యాలను చేరుకునేలా తగిన చర్యలు తీసుకుంటాం. హేతుబద్దీకరణ, పారదర్శకత లక్ష్యంగా ఈ చొరవ కొనసాగుతుంది.
కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు...
కొలంబియా మాజీ ప్రొఫెసర్ అరవింద్ పనగరియా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రణాళికా సంఘం స్థానంలో కొత్తగా ఏర్పాటు చేసిన నీతీ ఆయోగ్ వైస్ చైర్మన్‌గా పనగరియా నియమితులైన సంగతి తెలిసిందే. యూనివర్సిటీ ప్రెసిడెంట్ లీ బోలింగర్, ఆర్థికవేత్త-ప్రొఫెసర్ జగదీశ్ భగవతి, ఐక్యరాజ్యసమితిలో భారత్ రాయబారి అశోక్ ముఖర్జీ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.