మళ్లీ విజృంభించిన గుజ్జర్లు
గుజ్జర్లు మళ్లీ విజృంభించారు. ప్రభుత్వోద్యోగాలలో తమకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ తమ ఆందోళనను పునరుద్ధరించారు. గతంలోలాగే.. రైలు మార్గాలను అడ్డుకోవడంతో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రైలు పట్టాల మీద బైఠాయించిన గుజ్జర్లు.. భారీస్థాయిలో ధర్నాలకు కూడా దిగారు. గుజ్జర్ల ఆందోళన కారణంగా ఢిల్లీ-ముంబై మార్గంలో రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి.
భరత్పూర్ ప్రాంతంలోని పిలుకాపుర వద్ద ఆందోళన తీవ్రంగా ఉందని పోలీసులు అంటున్నారు. ఈ మార్గంలో ఆరు రైళ్లపై ప్రభావం పడటంతో ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేస్తున్నట్లు రైల్వే అధికారులు చెప్పారు. తమ ప్రధాన డిమాండు అయిన 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తేనే ఉద్యమాన్ని ఆపుతామని గుజ్జర్ ఆరక్షణ్ సంఘర్ష్ సమితి అధికార ప్రతినిధి హిమ్మత్ సింగ్ తెలిపారు. గుజ్జర్ నాయకుడు కిరోరి సింగ్ భైంస్లా మే 11న రిజర్వేషన్ల అంశంపై 'న్యాయయాత్ర' పేరుతో ఆందోళన ప్రారంభించారు. ఈయనే గతంలో ఏడెనిమిదేళ్ల క్రితం జరిగిన ఆందోళనకు నాయకత్వం వహించారు. తమకు ప్రస్తుతం కేవలం ఒక్కశాతం రిజర్వేషనే ఇస్తున్నారని, చట్టప్రకారం 50 శాతం పరిమితికి లోబడే తాము 5 శాతం అడుగుతున్నామని ఆయన చెప్పారు.