రోడ్లెక్కిన గుజ్జర్లు
జైపూర్: తమ డిమాండ్ను నెరవేర్చాలంటూ గుజ్జర్లు తమ ఆందోళనను రోజుకో తరహాలో చేస్తున్నారు. నిన్నమొన్నటివరకు రైలు మార్గాలనే ప్రధాన లక్ష్యంగా చేసుకొని ఆందోళన నిర్వహించిన వారు ఆదివారం జాతీయ రహదారులు ఎక్కారు. సవాయ్ మాదోపుర్ జిల్లాలోని దౌసా అనే గ్రామంవద్ద రోడ్డు నెంబర్ 11(ఆగ్రా-జైపూర్ రోడ్డును)ను స్థంబింపజేశారు. వందల సంఖ్యలో రోడ్లపై చేరి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో తమకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనంటూ గుజ్జర్లు ఆందోళన ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఇది ఆదివారం నాటికి నాలుగో రోజుకు చేరింది. వారు రహదారులు దిగ్భందనం చేయడంతో వాహనాలను వేరు వేరు చిన్న మార్గాలకు మళ్లించారు. శాంతిభద్రతలకు భంగంకలగకుండా పోలీసులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చర్చలకు ఆహ్వానించినప్పటికీ గుజ్జర్లు చర్చలు కుదరవని, తమ డిమాండ్ మేరకు స్పష్టమైన హామీ ఇస్తే సరిపోతుందని వారు ఆందోళన కొనసాగిస్తున్నారు.