న్యూఢిల్లీ సీఎం అభ్యర్థిగా హర్షవర్ధన్ను ఎంపిక చేసినట్లు భారతీయ జనతాపార్టీ (బీజేపీ) అధ్యక్షుడు రాజనాథ్ సింగ్ బుధవారం అధికారికంగా ప్రకటించారు. బీజేపీ పార్లమెంట్ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఆ సమావేశానికి పార్టీ అగ్రనేత ఎల్.కే.అధ్వానీతోపాటు పలువురు నేతలు హాజరైనట్లు పేర్కొన్నారు. హర్షవర్ధన్ గతంలో న్యూఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించిన సంగతి తెలిసిందే.
కాగా న్యూఢిల్లీ సీఎం అభ్యర్థి విజయ్ గోయల్ అని గతంలో బీజేపీ వెల్లడించింది. అయితే విజయ్ గోయల్ పలు వ్యాపారాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై వివాదాలు చెలరేగే అవకాశాలు ఉన్నాయని బీజేపీ నాయకత్వం భావించింది. దాంతో విజయ్ గోయల్ను ఒప్పించేందుకు పార్టీ నాయకత్వం రంగంలో దిగింది. దీంతో బీజేపీ నాయకత్వం చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానని విజయ్ గోయల్ స్పష్టం చేశారు. దాంతో హర్షవర్ధన్ ఎంపిక అనివార్యమైంది. న్యూఢిల్లీ శాసన సభకు డిసెంబర్ 4 వ తేదీన ఎన్నికలు జరగనున్న సంగతి విదితమే.