
తాళి కట్టి పరారయ్యాడు
జూపాడుబంగ్లా(కర్నూలు): బంధు- మిత్రులతో కలిసి వివాహాన్ని అంగరంగ వైభవంగా చేశారు. పెళ్లి అయిపోయి కుటుంబ సభ్యులంతా చాలా ఆనందంగా ఉన్నారు. తన కూతురి జీవితం చాలా సంతోషంగా గడవాలని తల్లిదండ్రులు కోరుకున్నారు. ఎన్నో ఆశాలతో కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామని అనుకున్న యువతి జీవితంలో అనుకోని సంఘటన చోటుచేసుకుంది. వేద మంత్రాల సాక్షిగా తాళి కట్టిన భర్త.. పెళ్లైన పన్నెండు గంటల్లోపే పత్తాలేకుండా పోయాడు. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన కర్నూలు జిల్లా జూపాడుబంగ్లాలో వెలుగుచూసింది.
గ్రామానికి చెందిన వెంకటస్వామి కుమార్తి మోతెలక్ష్మికి తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూరానికి చెందిన కొడిగంటి కురుమూర్తితో బుధవారం అట్టహాసంగా వివాహామైంది. పెళ్లి అనంతరం రాత్రి అంతా నిద్రిస్తున్న సమయంలో పెళ్లి కొడుకు ఎవరికి చెప్పకుండా పరారయ్యాడు. ఇది గుర్తించిన పెళ్లి కూతురు విషయం కుటంబ సభ్యులకు చెప్పడంతో వారంతా కలిసి కురుమూర్తి కోసం గాలించారు.
అయినా ఫలితం లేకపోవడంతో.. స్థానిక పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. గతంలోనే కురుమూర్తికి వివాహమైందని.. మొదటి భార్య కూడా కొల్లాపూర్ పోలీసుస్టేషన్‌లో ఇతనిపై కేసు పెట్టినట్లు బంధువులు అంటున్నారు. హైదరాబాద్‌లో షార్ట్‌ఫిలిమ్స్ తీస్తున్న కురుమూర్తి వివాహానికి ముందే లక్ష్మికి సెల్‌ఫోన్ బహుమతిగా ఇచ్చాడని తరచు ఫోన్ చేసేవాడని.. బాగా మాట్లాడేవాడని పెళ్లి కూతురు చెబుతోంది.