ఎంఎన్‌జేలో క్యాజువాల్టీ వార్డు | Health Minister visited medical Cancer hospital | Sakshi
Sakshi News home page

ఎంఎన్‌జేలో క్యాజువాల్టీ వార్డు

Published Thu, Sep 3 2015 4:05 AM | Last Updated on Sun, Sep 3 2017 8:37 AM

ఎంఎన్‌జేలో క్యాజువాల్టీ వార్డు

ఎంఎన్‌జేలో క్యాజువాల్టీ వార్డు

కేన్సర్ ఆస్పత్రిని సందర్శించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి
సాక్షి, హైదరాబాద్: ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రిలో క్యాజువాల్టీ వార్డు ఏర్పాటైంది. ఆస్పత్రి చరిత్రలో తొలిసారిగా నాలుగు పడకలతో దీన్ని ఏర్పాటుచేశారు. ‘నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి’ శీర్షికతో మంగళవారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనంపై స్పందించిన ప్రభుత్వం ఆస్పత్రి అవుట్‌పేషంట్ బ్లాక్‌లో నాలుగు పడకల సామర్థ్యంతో ఓ క్యాజువాల్టీ వార్డును కూడా ఏర్పాటు చేసింది.

కార్పొరేట్ ఆస్పత్రుల్లో తీవ్ర దోపిడీకి గురై, ఇక తమ వల్ల కాదంటూ  ఏ గాంధీ ఆసుపత్రికో, ఉస్మానియాకో తమ  ఆస్పత్రుల నుంచి బలవంతంగా పంపించేస్తున్న రోగులకు క్యాజువాల్టీలో సేవలు అందించేందుకు ప్రత్యేక సిబ్బందిని కూడా నియమించింది.
 
వార్డులన్నీ తిరిగిన మంత్రి...
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి బుధవారం ఉదయం ఆస్పత్రిని సందర్శించి రోగులకు అందుతున్న సేవలు, ఇతర సమస్యలపై ఆరా తీశారు. ఓపీ బ్లాక్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన క్యాజువాల్టీ సహా ఓపీ బిల్డింగ్‌పై కొత్తగా నిర్మించిన ఇన్‌పేషంట్స్ వార్డు తదితర విభాగాల్లో కలియతిరిగారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పలువురు రోగులను పరామర్శించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆస్పత్రి డెరైక్టర్ డాక్టర్ జయలత ఆస్పత్రిలోని పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, ఆస్పత్రికి కావాల్సిన వైద్య పరికరాలు, ఇతర అవసరాలపై ప్రతిపాదనలు తయారు చేసి పంపాల్సిందిగా మంత్రి ఆమెకు సూచించారు.
 
త్వరలో బ్లడ్ కాంపోనెంట్ సెపరేట్ మిషన్
ఆస్పత్రికి వారం రోజుల్లో ‘బ్లడ్ కాంపోనెంట్ సెల్ సెపరేట్ మిషన్’ను అందిస్తామని లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. లాండ్రీ, కిచెన్ కోసం అధునాతన భవనాలు నిర్మిస్తామన్నారు. శిథిలావస్థకు చేరినపాత భవనాన్ని ఆధునీకరించి రోగులకు ఇబ్బంది లేకుండా చూస్తామని, ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా అక్కడే ఉన్న టీఎస్‌ఎంఐడీసీ అధికారులకు మంత్రి ఆదేశించారు.

విద్యు త్ సరఫరాలో హెచ్చు తగ్గులను నివారించేందుకు మరో ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయాలని వైద్యులు కోరగా, తగు ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులకు సూచించారు. ఓపీబ్లాక్ రెండో అంతస్తులో కొత్తగా నిర్మించిన ఇన్‌పేషంట్ వార్డులో అవసరమైన వెంటిలేటర్లు, సెంట్రల్ ఆక్సిజన్ సిష్టం, పడకలు,ఇతర అవసరాలు సమకూర్చి రోగులకు అందుబాటులోకి తెస్తామన్నారు. మంత్రి వెంట నాంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, డీఎంఈ డాక్టర్ రమణి, తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement