ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. విధ్వంసం సృష్టిస్తున్నాయి.ప్రధానంగా చమోలి జిల్లాలో క్లౌడ్ బరస్ట్ కారణంగా భారీ వర్షాలు కురవడంతో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఉత్తరకాశీ జిల్లాలో కూడా పలు నివాస ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో ఆ ప్రాంతాల్లో నివసించేవారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సి వచ్చింది.
హరిద్వార్ జిల్లాలో 24 మందితో వెళ్తున్న పడవ ఒకటి లక్సర్ సమీపంలో గంగానదిలో చిక్కుకుపోవడంతో కాసేపు అంతా ఆందోళన చెందినా, తర్వాత మాత్రం వారందరినీ రక్షించగలిగిగనట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరద ప్రభావంతో దారుణంగా పాడైన రోడ్ల పునరుద్ధరణ పనులను బీఆర్ఓ, పీడబ్ల్యుడీ శాఖలు చేపడుతుండగా, ఇప్పుడు కురుస్తున్న వర్షాలు ఆ పనులకు ఆటంకం కలిగిస్తున్నాయి. ఉత్తరకాశీ జిల్లాలోని బాడ్కోట్ ప్రాంతంలో గడిచిన 24 గంటల్లో ఏకంగా 10.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
హరిద్వార్లో గంగానది గత కొన్ని రోజులుగా ప్రమాద స్థాయికి సమీపంలో ప్రవహిస్తోంది. పౌరి జిల్లాలో శతాబ్దాల నాటి మఠం ఒకటి అలకనందా నది వరదలో కొట్టుకుపోయింది. అలకనందా నది ఒడ్డున ఎప్పుడో 1625 సంవత్సరంలో ఏర్పాటుచేసిన ఈ చారిత్రక కేశోరాయ్ మఠం నదిలో కొట్టుకుపోయినట్లు పౌరి జిల్లా విపత్తు నివారణ అధికారి రవ్నీత్ చీమా తెలిపారు. గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో పునాదులతో సహా మఠం మొత్తం కుప్పకూలినట్లు ఆమె చెప్పారు. ఇప్పుడక్కడ కేవలం ఒక గోడ మాత్రమే మిగిలింది. జిల్లాలో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.
చమోలిలోని కమెడా ప్రాంతం నుంచి కొండచరియలు విరిగిపడటంతో బద్రీనాథ్ జాతీయ రహదారిని మూసేశారు. ఆ జిల్లాలోని దేవల్, తరాలి ప్రాంతాల్లో ఆరు ఇళ్లు కుప్పకూలాయి. అర డజనుకు పైగా వంతెనలు కొట్టుకుపోయాయి. ఉత్తరకాశీ జిల్లాలోని గునాల్ గ్రామంలో ఇళ్లు మునిగిపోతున్నాయి. దీంతో ఆ ఇళ్లలోని వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు.
ఉత్తరాఖండ్లో మళ్లీ భారీ వర్షాలు, విధ్వంసం
Published Thu, Aug 15 2013 4:08 PM | Last Updated on Fri, Sep 1 2017 9:51 PM
Advertisement