
బాలయ్య..ఇటూ రావయ్యా..
నియోజక వర్గంలో కాలు పెట్టక దాదాపు ఎనిమిది నెలలు అవుతోంది.
► నియోజకవర్గం వైపుకన్నెత్తి చూడని ఎమ్మెల్యే
► సమస్యలు వెల్లువెత్తినా అడుగు పెట్టనివైనం!
► మరో 40రోజులు షూటింగ్‌లో బిజిబిజీ..
ఎమ్మెల్యే వస్తారన్న ఆశలు వదులుకున్న ప్రజలు?
హిందూపురం అర్బన్: నియోజక వర్గంలో కాలు పెట్టక దాదాపు ఎనిమిది నెలలు అవుతోంది. ఇంతకాలం రాకుండా కాలం గడిపిన ఏకైక ఎమ్మెల్యే బాలకృష్ణ కావచ్చు. ఇటూ ప్రజలకు.. అటూ పార్టీలో ఎన్ని సమస్యలు, అవంతరాలు వచ్చినా నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడకుండ బాలయ్య చరిత్ర సృష్టంచారని చెప్పుకోవచ్చు. పట్టణంలో ప్రజలు తాగు నీటికోసం ఇబ్బందులు పడుతున్న ఏం జరుగుతోందని ఇటూ వైపు రాలేదు. బాలకృష్ణ ఎమ్మెల్యే గా గెలిచినప్పటి నుంచి ప్రతినిధ్యం వహించిన నియోజక వర్గానికి వచ్చి వెళ్లిన రోజలు వేళ్ల పై లెక్కపెట్టవచ్చు. ఆయన ఎప్పుడు వచ్చినా పోలీసులు, నాయకుల హడవుడి ఆర్భాటాలుగా ప్రారంభోత్సవాలు, రోడ్డుషోలే తప్ప ప్రజల చెంతకు వచ్చి ప్రజల కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్న దాఖలాలు లేవు. ఇక్కడి ప్రజలు ఎమ్మెల్యే వస్తారన్న ఆశలు వదులుకున్నారు.
ఎన్ని పరిణామాలు జరిగినా:
నియోజక వర్గంలో జనవరి నెలలో పదిరోజులు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జన్మభూమి కార్యక్రమాల్లో బాలకృష్ణ పాల్లొంటారని నాయకలు చెప్పారు. ప్రజలు తమ వినతులను నేరుగా ఎమ్మెల్యేకి చెబుతామని ఎంతో ఆశతో ప్రజలు ఎదురుచూశారు. అయినా వారి ఆశలు ఫలించలేదు. తర్వాత జనవరి 23వ తేది నీటి ఎద్దడి పై జాతీయ కరువు బృందం పర్యటించింది. ఇతన నియోజకవర్గాల నుంచి ఎమ్మల్యేలు తమ అభ్యర్ధనలు కరువు బృందానికి అందించారు. కానీ బాలకృష్ణ ఇటూవైపు రాలేదు. జనవరి 29 తేది నుంచి టీడీపీలో అసమ్మతి సెగలు పుట్టాయి. మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, అంబికా లక్ష్మినారాయణలు ఎమ్మెల్యే పీఏ శేఖర్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.
అనేక సమావేశాలు నిర్వహించి పార్టీకి అల్టిమేటం ఇచ్చారు. ఈ సమావేశాలు, వర్గబేధాలు నియోజలవర్గంలోనే కాకుండా జిల్లాలోనే చర్చనీయంశంగా మారాయి.కర్నాటక సరిహద్దులో అసమ్మతి నాయకులు సమావేశాలు చేసి ముకుమ్మడి రాజీనామాలకు సై అన్నారు. ఎమ్మెల్యే ఇక్కడి రాకపోగా పార్టీ పరిశీలకులుగా కృష్ణమూర్తి పంపినా ప్రయోజనం లేకపోయింది. చివరకు ఫ్రిబవరి 28వతేదిన ఎమ్మెల్యే బాలకృష్ణ అసమ్మతినాయకులను హైదరాబాద్‌కు పిలిపించి చర్చించి శేఖర్‌ను తొలగిస్తామని చెప్పి పార్టీనుంచి బహిష్కరించిన కొందరు నాయకులకు తిరిగీ సభ్యత్వం ఇచ్చారు.
పార్టీలో కొంత స్తబ్దత
వెనువెంటనే వేసవి ప్రారంభంలోనే పట్టణంలో నీటిటిసమస్య మొదలైంది. ఇదే తరుణంలో మున్సిపల్ చైర్‌పర్సన్, కమిషనర్ మధ్య వివాదాలు పొడచూపాయి. నీటిసమస్య తెరపైకి వచ్చి తీవ్రరూపం దాల్చినా ఎమ్మెల్యే బాలకృష్ణ ఇటూ రాలేకపోయారు. మార్చి 29వ తేదిన ఉగాది పండుగకు లేపాక్షి ఆలయానికి ఎమ్మెల్యే బాలకృష్ణ వస్తారని ప్రచారం జరిగినా ఆయన రాలేదు. ఏప్రిల్ 9వతేదిన తోమ్మిదోవార్డు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ సమయంలో తప్పకుండ వస్తారని భావించినా తిరిగి చూడలేదు. ఏప్రిల్ 17వతేదిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆద్వర్యంలో òనీటిసమస్యపై పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు.
జిల్లాకు విచ్చేసిన సీఎం చంద్రబాబు అదికారులు, పాలకులతో చర్చించి నీటిసమస్యను పరిష్కరించాలని ఆదేశాలు జారీచేశారు. నియోజకవర్గంలో ఇంత గందరగోళం జరుగుతున్నా ఎమ్మెల్యే బాలకృష్ణ మాత్రం హిందూపురంలో అడుగు కూడా పెట్టలేదు. తర్వాత మే 6 వతేదిన కూల్చివేసిన కూరగాయల మార్కెట్ పునరుద్దరించాలని వైఎస్సార్‌సీపీ మరోసారి ధర్నాకు పిలుపునివ్వడంతో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ ఇంటివద్ద పోలీసులను మోహరించి గృహనిర్భద్ధం చేయడంతో చర్చనీయంశంగా మారింది. మే 10వతేదిన బాలకృష్ణ వచ్చి మార్కెట్ నిర్మాణానికి భూమిపూజ చేస్తున్నారని అందుకే వైఎస్సార్‌సీపీ నాయకులు ఆందోళనలు చేస్తున్నారని టీడీపీ నాయకులు విమర్శించారే గానీ ఇంతవరకు మార్కెట్ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి జీవో కూడా విడుదలకాలేదు.
మీనీ మహానాడు కూడా హాజరు కాని ఎమ్మెల్యే:
టీడీపీ ప్రతిష్టాత్మాకంగా చేపడుతున్న మీనీ మహానాడు సభల్లో అన్నిచోట్ల నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరిగాయి. అయితే ఈ కార్యక్రమాన్ని హిందుపురంలో చివరకు చేపట్టారు. అయినా ఈ సమావేశానికి కూడా బాలకృష్ణ హాజరు కాలేదు. ఈ సభకు కొందరు కూడా ముఖ్య నాయకులు హాజరుకాలేదు. మండలాల నుంచి కొందరు కూడా ప్రజా ప్రతినిధులు రాలేదు. దీంతో పార్టీలో విభేదాలు పూర్తిగా సమిసిపోలేదని స్పష్టమైంది. ప్రజలే కాకుండా పార్టీనాయకులు, కార్యకర్తలు కూడా ఎమ్మల్యే వస్తారన్న ఆశలు వదులుకున్నారు.
మరో40 రోజలు బాలయ్య బిజిబిజీ :
ఎమ్మల్యే బాలకృష్ణ హిందూపురంకు వస్తున్నారని భారీగా పోస్టర్లు, బ్యానర్లు కట్టరేగానీ ఇంతవరకూ ఎమ్మెల్యే జాడేలేదు. కొత్త సినిమా షూటింగ్‌కు విదేశీ టూర్‌కు వెళ్లరని చెప్పడంతో వస్తారన్న ఆశలు నీరు గారిపోయాయి. సినిమా షూటింగ్ పూర్తి కావటానికి దాదాపు 40 రోజులు పట్టవచ్చని నాయకులు చెప్పుకుంటున్నారు. దీంతో ఎమ్మెల్యే రాక మరో నెల రోజులు పడుతుందని తెలుస్తోంది. దీంతో ఎనిమిది నెలలు నియోజకవర్గం ముఖం చూడని ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించే ఘనత బాలయ్యకు దక్కుతుంది.