హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు మరణించడం చాలా బాధాకరమని, మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ మోదీ ట్వీట్ చేశారు.
రైల్వే శాఖ సహాయక చర్యలను పర్యవేక్షిస్తోందని, క్షతగాత్రులను ఆదుకుంటామని మోదీ పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడినవారు తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు.. ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ, గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు.
ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్ నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్ వెళ్తున్న హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు సమీపంలో శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 35 మందికి పైగా మరణించగా, మరో 100 మంది గాయపడ్డారు.