
హీరో మోటో లాభం 525 కోట్లు
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్ అక్టోబర్-డిసెంబర్(క్యూ3) కాలానికి రూ. 525 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది(2012-13) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 488 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు 8% వృద్ధి. ఇక అమ్మకాలు 11% పుంజుకుని రూ. 6,846 కోట్లకు చేరుకున్నాయి. అంతక్రితం రూ. 6,151 కోట్ల అమ్మకాలను సాధించింది. ఈ కాలంలో మొత్తం 16,80,940 వాహనాలను విక్రయించింది. గతంలో ఇదే కాలానికి 15,73,135 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. మందగమన మార్కెట్లోనూ అమ్మకాలను పెంచుకోగలిగామని కంపెనీ ఎండీ పవన్ ముంజాల్ చెప్పారు. అయితే లోహాల ధరలు పెరగడం, కరెన్సీ హెచ్చుతగ్గుల వల్ల లాభదాయకత పరిమితమైనట్లు తెలిపారు.
టాంజానియా, ఉగాండా, ఈజిప్ట్ తదితర కొత్త మార్కెట్లకు వాహన ఎగుమతులను మొదలుపెట్టినట్లు కంపెనీ పేర్కొంది. లాటిన్ మార్కెట్లలో విక్రయించేందుకు వీలుగా కొలంబియాలో తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసే సన్నాహాల్లో ఉన్నట్లు వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో హీరో మోటో షేరు బీఎస్‌ఈలో 3.4% క్షీణించి రూ. 2,000 వద్ద ముగిసింది.