వాట్సాప్ ద్వారా పాత నోట్లు మార్చి..
కోల్కతా: ఒక దిక్కు పాత నోట్ల రద్దు.. రోజులు గడిస్తేగానీ చేతిలోకి కొత్త డబ్బులు రావు.. కానీ అప్పటికే టైమ్ తరుముకొస్తోంది.. ఆసుపత్రిలో డబ్బుకట్టి డిశ్చార్జి కాకుంటే బిల్లు రెట్టింపు అవుంతుంది. ఏం చెయ్యాలి? ఎవర్ని కలవాలి? రోగి బంధువులంతా వెళ్లి డాక్టర్ల కాళ్లావేళ్లా పడ్డారు. పాత నోట్లు తీసుకోమని బతిమాలారు. కనీసం చెక్కైనా స్వీకరించమన్నారు. కానీ వాళ్ల బాధను డాక్టర్లుగానీ, ఆస్పత్రి సిబ్బందిగానీ పట్టించుకోలేదు. చివరికి ఆ కుటుంబం వాట్సాప్ ద్వారా హాస్పిటల్ బిల్లుకు సరిపడా చెల్లుబాటయ్యే డబ్బును సేకరించింది..
కోల్ కతాకు చెందిన సుకాంత చావ్లే(35) డెండీ జ్వరంతో అలీపూర్ లోని బీజీ పొద్దార్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. బుధవారం రాత్రి సుకాంత డిశ్చార్జి కావాల్సిఉంది. అప్పటికే బిల్లు మొత్తం రూ.40 వేలను కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉంచుకున్నారు. కానీ హాస్పిటల్ వాళ్లు పెద్ద నోట్లు తీసుకోబోమన్నారు. కాళ్లావేళ్లా పడ్డా, చెక్కు రాసిచ్చినా ఒప్పుకోలేదు. చెల్లుబాటయ్యే డబ్బులే ఇవ్వాలని, లేకుంటే రెట్టింపు డబ్బు చెల్లించాల్సిఉంటుందని రోగి కుటుంబాన్ని భయపెట్టారు. ఈ అయోమయంలోనే చావ్లే సోదరుడు.. తెలినవాళ్లకు వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టాడు.. ‘ప్లీజ్ మీ దగ్గర చిల్లర డబ్బులుంటే ఇవ్వండి..’ అని.
నిమిషాల్లోనే ఈ మేసేజ్ కోల్ కతా అంతటా షేర్ అయింది. తెలిసినవాళ్లు, పరిచయం లేనివాళ్లు ఉదారంగా స్పందించారు. చావ్లే సోదరుడి వద్ద ఉన్న పెద్ద నోట్లను తీసుకుని తమ దగ్గరున్న చిల్లర నాణేలను ఇచ్చేశారు. కొందరైతే పిల్లల కిడ్డీ బ్యాంక్ డబ్బులనూ తీసుకొచ్చిఇచ్చారు. గురువారం ఉదయానికే ఆసుపత్రి వద్దకు చేరుకున్న చావ్లే కుటుంబీకులు.. ఆస్పత్రి ఆవరణలోనే చిల్లర నాణేలను లెక్కించారు. మొత్తం రూ.40 వేల చిల్లరను ఆసుపత్రికి చెల్లించే ప్రయత్నం చేశారు. కానీ..
ఆస్పత్రి ఉద్యోగులు నాణేలను తీసుకోవడానికి నిరాకరించారు. దీంతో వాగ్వాదం మొదలైంది. బీపీ పొద్దార్ ఆస్పత్రి తీరుపై రోగి బంధువులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆస్పత్రి వర్గాలను హెచ్చరించి, డబ్బు తీసుకునేందుకు ఒప్పించారు. అప్పుడు చూడాలి ఆస్పత్రి యాజమాన్యం బాధ.. రూ.40 వేల నాణేలను లెక్కించడానికే నలుగురు ఉద్యోగులను నియమించింది. కనీసం నాలుగు గంటలు పట్టిందా నాణేలను లెక్కబెట్టడానికి. చివరికి.. ఆస్పత్రి యాజమాన్యాన్ని తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టి సుకాంత చావ్లేను తీసుకొని ఇంటికి వెళ్లిపోయారంతా! ఎలాంటి కష్టమైనా సోషల్ మీడియా ద్వారా పంచుకుంటే ఏదో ఒక పరిష్కారం దొరక్కపోదు. ఏంటారు?