భలే బాసులు! | Housing.com CEO Rahul Yadav to return his entire stock to employees | Sakshi
Sakshi News home page

భలే బాసులు!

Published Fri, May 15 2015 9:30 AM | Last Updated on Sun, Sep 3 2017 2:02 AM

భలే బాసులు!

భలే బాసులు!

(సాక్షి వెబ్ ప్రత్యేకం)

జేబులో పది రూపాయిలు ఉంటే రూపాయి దానం చేయడానికి ఆలోచిస్తాం. అలాంటిది రూ.200 కోట్ల విలువైన వాటాను ఉదారంగా వదిలేస్తే. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. మూడు పదుల వయసు కూడా లేని యువ సీఈవో ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం ఇక్కడ విశేషం. తన వాటా మొత్తాన్ని ఉద్యోగులకు ఇచ్చివేస్తున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు హౌసింగ్‌డాట్‌కామ్‌ సీఈవో రాహుల్ యాదవ్. సుమారు రూ. 200 కోట్ల విలువైన తన వాటా మొత్తాన్ని కంపెనీలలోని 2,251 మంది స్టాఫ్ కు ఇచ్చేశారాయన. ఈలెక్కన చూసుకుంటే ఒక్కో ఉద్యోగికి రూ.6.50 లక్షల నుంచి రూ. 9 లక్షల వరకు ముడుతుందన్న మాట.  ఒక్కో ఉద్యోగికి ఏడాది జీతానికి సమానమైన మొత్తం అందుతుందని అంచనా. ఇప్పటినుంచే డబ్బు గురించి ఆలోచించడం లేదని 26 ఏళ్ల రాహుల్ ప్రకటించడం ఆసక్తి గొలిపే అంశం.

సీటెల్ కేంద్రంగా పనిచేస్తున్న క్రెడిట్ కార్డ్ ప్రాసెసర్ కంపెనీ గ్రావిటీ పేమెంట్స్ సంస్థ అధినేత డాన్ ప్రైస్ కూడా ఇలాంటి పనే చేశారు.  సిబ్బంది జీతాలు పెంచేందుకు తన వేతనాన్ని వదులుకున్నారు. సుమారు 10 కోట్ల రూపాయల జీతాన్ని త్యాగం చేసి 70 మంది ఉద్యోగులకు పంచారు. వీరిలో 30 మందికి జీతం డబుల్ కావడం విశేషం. అమెరికాలో సగటు వేతన జీవుల జీతం సుమారు రూ.13 లక్షలు ఉండగా,  డాన్ ప్రైస్ ఉదారతతో గ్రావిటీ పేమెంట్ ఉద్యోగుల సగటు వేతనం దాదాపు రూ. 45 లక్షలకు చేరింది. బాస్ తన జీతం కుదించుకుని తమ వేతనం పెంచడంతో డాన్ ప్రైస్ పై ఉద్యోగులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇదిలావుంటే నాలోని టీన్స్ గ్రూప్ అధిపతి లీ జినువాన్‌లా తన ఉద్యోగులకు ఊహించని కానుక ఇచ్చారు. ఏకంగా 6,400 మంది తన సంస్థ ఉద్యోగులను హాలిడే టూర్ కోసం ఫ్రాన్స్ తీసుకెళ్లి ఔరా అనిపించారు. రూ. 240 కోట్లు ఖర్చు పెట్టి తొమ్మిది రోజుల పాటు ఫ్రాన్స్ లోని నగరాలన్ని చూపించారు. ఇక పర్యటన చివరి రోజున ఫ్రాన్స్ నగరం నీస్‌లో టీన్స్ ఉద్యోగులంతా ఒకే తరహా దుస్తులు ధరించి మానవహారంతో అందరి దృష్టిని ఆకర్షించారు. వందల కోట్లు ఖర్చు పెట్టి విదేశీయానం చేయించిన తమ బాస్ ను టీన్స్ గ్రూప్ ఉద్యోగులు తెగ పొగిడేస్తున్నారు.

సూరత్ కు చెందిన వజ్రాల వ్యాపారి సావ్‌జీ ఢోలకియా కూడా ఇదేవిధంగా ఊహించని బహుమతులు ఇచ్చి ఉద్యోగులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తారు. ఢోలకియాకు చెందిన హరికృష్ణ ఎక్స్‌పోర్ట్స్ సంస్థలో పనిచేసే 1200 మందికి ఉద్యోగులకు గతేడాది దీపావళికి విలువైన కానుకలిచ్చి వార్తల్లో నిలిచారు. 491 ఫియట్ పుంటో కార్లు, 200 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు.. ఇంకా ఆభరణాలు మొదలైనవి ఉద్యోగులకు పంచారు. సంస్థ వృద్ధికి తోడ్పడిన ఉద్యోగులను ప్రోత్సహించే ఉద్దేశంతో వీటిని అందించినట్లు ఢోలకియా చెప్పారు. విలువైన బహుమతులిచ్చిన తమ యజమాని ఢోలకియాకు 'షుక్రియా' అంటూ ధన్యవాదాలు తెలిపారు ఉద్యోగులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement