
ఎంత కష్టమో!
కష్టపడి కాదు ఇష్టపడి చదవండి అని పెద్దలు చెబుతుంటారు. కానీ తమకు ఇష్టమైన చదువు కోసం ఎంతో కష్టపడాల్సి వస్తోందని ఆదివాసీ బాలలు అంటున్నారు.
కష్టపడి కాదు ఇష్టపడి చదవండి అని పెద్దలు చెబుతుంటారు. కానీ తమకు ఇష్టమైన చదువు కోసం ఎంతో కష్టపడాల్సి వస్తోందని ఆదివాసీ బాలలు అంటున్నారు. బడికి వెళ్లేందుకు వారు పడే ఇబ్బందులు చూస్తే ఇది నిజమేననిపిస్తుంది. ఒడిశా రాష్ట్రం కొందమాల్ జిల్లా దరింగబడి సమితి అసురబొందా గ్రామంలో 150 ఆదివాసీ కుటుంబాలు నివసిస్తున్నాయి. ఆ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల లేదు. దీంతో వారు చదువుకునేందుకు మూడు కిలోమీటర్ల దూరంలోని గజలబడి గ్రామానికి వెళ్లాలి. అసురబొందా, గజలబడి గ్రామాల మధ్య ఒక ఏరు ఉంది. ఎండాకాలంలో వారు కాలువలో దిగి నడుచుకుని వెళతారు.
వర్షాకాలం వస్తే మాత్రం నానాపాట్లు పడాల్సిందే. దీంతో కాలువకు ఈ ఒడ్డున, ఆ ఒడ్డున గల చెట్లకు రెండు తాళ్లు కట్టారు. చెట్టుపైకి ఎక్కి దాని మీద నుంచి ఒక తాడుపై నడుస్తూ పైనున్న తాడును పట్టుకుని ఆ ఒడ్డుకు వెళతారు. పిల్లలు తాడుపై వెళుతుంటే ఒడ్డున ఉన్న తల్లిదండ్రులు ఆందోళనతో చూస్తూ ఉంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల కింద గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు నిర్మిస్తున్నట్లు ప్రకటనలు గుప్పిస్తుంటాయి. అసురబొందా గ్రామ విద్యార్థుల కోసం ఏదో ఒక పథకం కింద ఇక్కడ వంతెనను నిర్మించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.