ఎన్ని ఉద్యోగాలు వస్తాయో చెప్పాలి
- ‘గ్రూప్స్’పై అవగాహన సదస్సులో ప్రభుత్వానికి కోదండరాం ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాదు.. యువతకు బతుకుదెరువు చూపించాల్సిన బాధ్యత కూడా ఉద్యమకారులందరిపైనా ఉందని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని చెబుతున్న సర్కారు, ఇక్కడి నిరుద్యోగ యువతకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయో కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళాభవన్‌లో ‘గ్రూప్స్ సిలబస్- ప్రిపరేషన్ విధానం’పై తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం అవగాహన సదస్సు నిర్వహించింది.
సదస్సుకు కోదండరామ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఖాళీ అయ్యే ఉద్యోగాలను ఏటా భర్తీచేసే విధంగా రెగ్యులర్ కేలండర్ ప్రకారం నోటిఫికేషన్లు వచ్చేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు. గ్రూప్స్ పరీక్షల్లో విజయం కోసం యువత ఒక ప్రణాళిక ప్రకారం సిద్ధంకావాలన్నారు. అయితే జీవితంలో ఇదే అంతిమంగా భావించకూడదని, పోటీ పరీక్షల కోసం చేసిన కృషి భవిష్యత్‌లోనూ తప్పకుండా ఉపయోగపడుతుందని చెప్పారు. సామాజిక ఉద్యమాలు, మానవహక్కులు తదితర అంశాలపై ఓపెన్ యూనివర్సిటీ తయారుచేసిన పుస్తకాలు ఎంతో ఉపకరిస్తాయని తెలిపారు. 1968 నుంచి 2014 వరకు వివిధ దశల్లో జరిగిన తెలంగాణ ఉద్యమ స్వరూపాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు.
అనుభవాలనే విజ్ఞానంగా..: హరగోపాల్
తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పాల్గొన్న యువత ఈ పోటీ పరీక్షల్లో నెగ్గేందుకు తమ అనుభవాలనే విజ్ఞానంగా మార్చుకోవాలని టీఎస్‌పీఎస్సీ సిలబస్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ హరగోపాల్ సూచించారు. ప్రత్యేక రాష్ట్ర సాకారంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సోనియాగాంధీ, కేసీఆర్.. ఇలా ప్రతి ఒక్కరి కృషి ఉందన్నారు. ప్రొఫెసర్ జయశంక ర్ గురించిన అంశాలను సిలబస్‌లో ఎందుకు చేర్చలేదని కొంతమంది అడుగుతున్నారని, ‘తెలంగాణ ఉద్యమంలో విద్యావ ంతుల పాత్ర’ అనే అంశంలోనే అందరి పాత్ర ఉంటుందని చెప్పారు.
‘వన్‌టైమ్’ కోరాం: ప్రొ. నాగేశ్వర్
తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఉద్యోగులందరికీ ఒక ఇంక్రిమెంట్ ఇచ్చిన ప్రభుత్వం... నిరుద్యోగుల కోసం వన్‌టైమ్ రిక్రూట్‌మెంట్(అన్ని ఖాళీల భర్తీ) చేపట్టాలని శాసన మండలిలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశానని మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ చెప్పారు. పోటీపరీక్షలకు ప్రిపేరయ్యే నిరుద్యోగ యువతకు నాణ్యమైన శిక్షణను ప్రభుత్వమే ఇప్పించాలని కోరినట్లు తెలిపారు. అభ్యర్థులు నిరంతరం కొత్త విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నించాలని సూచించారు.
బ్రోకర్ల మాయలో పడొద్దు: విఠల్
టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల భర్తీలో అత్యంత పారదర్శకంగా వ్యహరిస్తుందని... కమిషన్ చైర్మన్, సభ్యులు తెలుసంటూ మోసానికి పాల్పడే బ్రోకర్ల మాయలో పడవద్దని కమిషన్ సభ్యుడు విఠల్ చెప్పారు. అటువంటి బ్రోకర్ల సమాచారాన్ని తమకందిస్తే వారిని జైలుకు పంపుతామన్నారు. పరీక్షలు, ఇంటర్వ్యూల నిర్వహణకు సంబంధించి యూపీఎస్సీలో ఎటువంటి విధానం ఉందో అటువంటి విధానాన్నే టీఎస్‌పీఎస్సీ అమలు చేస్తోందని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం నిజాయితీపరులైన అధికారులను అందించడమే కమిషన్ లక్ష్యమన్నారు.
తపన ఉంటే సాధించొచ్చు: కిషన్‌రావు
సాధించాలనే తపన ఉంటే ఎటువంటి లక్ష్యాన్నైనా తప్పకుండా సాధిస్తారని, ఉద్యోగ పరీక్షలకు శ్రద్ధతో సిద్ధం కావాలని ఆర్థిక విషయ నిపుణుడు ప్రొఫెసర్ కిషన్‌రావు చెప్పారు. గ్రూప్స్‌లో నెగ్గాలంటే మూడు నుంచి ఎనిమిది నెలల ప్రిపరేషన్ అవసరమన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థతోపాటు తెలంగాణ ఎకానమీ గురించి తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు.
అండగా ఉంటాం: చంద్రశేఖర్‌గౌడ్
తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన నిరుద్యోగ యువతకు అండగా ఉంటామని తె లంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీపీఎస్సీ ద్వారా జరిగిన నియామకాల్లో తెలంగాణ అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. ఐదేళ్లుగా లక్షలాది మంది నిరుద్యోగులు గ్రూప్స్ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో... కనీసం ఐదు వేల ఉద్యోగాలకైనా ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వకుంటే నిరుద్యోగ యువతకు న్యాయం జరగదన్నారు. ఈ విషయమై త్వరలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలసి విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిపారు.
అవగాహన ముఖ్యం: అడపా
అభ్యర్థులకు తెలంగాణ అస్తిత్వం, సామాజిక వారసత్వం, చరిత్ర, సంస్కృతిపై అవగాహనను పరీక్షించేలా ఆయా అంశాలను సిలబస్‌లో పొందుపర్చినట్లు టీఎస్‌పీఎస్సీ సలహా కమిటీ చైర్మన్ అడపా సత్యనారాయణ చెప్పారు. శాతవాహనులు, కాకతీయుల నాటి తెలంగాణ నుంచి ఆధునిక కాలం వరకు చరిత్రపై ఎక్కువగా దృష్టి పెట్టాలన్నారు.
మోటివేట్ చేసుకోవాలి: చంద్రావతి
యువత ఉద్యోగాల సాధన కోసం తమను తామే మోటివేట్ చేసుకోవాలని టీఎస్‌పీఎస్సీ సభ్యురాలు బానోతు చంద్రావతి సూచించారు. ఉద్యోగాలిప్పిస్తామని మోసపు మాటలు చెప్పే వారిని నమ్మవద్దని చెప్పారు. ఉద్యోగాలు కావాలంటే ఎవరైనా పోటీ పరీక్షలు ఎదుర్కోవాల్సిందేనన్నారు.
రాజ్యాంగాన్ని చదవండి: ప్రొ. జీపీరెడ్డి
గ్రూప్ పరీక్షల్లో ఎంపిక కావాలంటే రాజ్యాంగంలోని అధికరణలన్నింటినీ చదవాల్సిన అవసరం ఉందని ప్రొఫెసర్ జీపీరెడ్డి సూచించారు. ప్రాథమిక హ క్కులు, న్యాయస్థానాల ద్వారా లభించిన హక్కులు, చాలెంజెస్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్.. తదితర అంశాలపై సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలన్నారు.