
ప్రతిపక్షాన్ని ఎలా ఎదుర్కొందాం!
సాక్షి,హైదరాబాద్: శాసనసభ వర్షాకాల సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీ ప్రస్తావించనున్న అంశాలపై ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో జరిగిన టీడీఎల్పీ వ్యూహ కమిటీ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. వైఎస్సార్‌సీపీ ప్రస్తావించే అంశాలకు ఎలా బదులివ్వాలనే దానిపై చంద్రబాబు పలు సూచనలు చేశారు. కరువు పరిస్థితులు, గోదావరి పుష్కరాల్లో యాత్రికుల మరణం తదితర కీలక అంశాలపై దృష్టి సారించాలని చెప్పారు. వైఎస్సార్‌సీపీ ప్రస్తావించే అంశాలపై గట్టిగా సమాధానం ఇచ్చేందుకు మంత్రులు సిద్ధంగా ఉండాలన్నారు.
ఏయే అంశాలపై ఎవరెవరు మాట్లాడాలో నిర్ణయించారు. గోదావరి పుష్కరాల్లో భక్తుల మరణంపై సభలో చర్చకు వస్తే సీఎం హోదాలో సంప్రదాయం ప్రకారం తాను పుష్కరఘాట్‌లో స్నానమాచరించినట్లు వివరిస్తానని, పార్టీ ఎమ్మెల్యేలు దీన్నే తమ ప్రసంగాల్లో చెప్పాలని బాబు పేర్కొన్నారు.పుష్కరఘాట్‌లో స్నానం చేసి, ఆ తర్వాత వీఐపీ ఘాట్‌కు వెళ్లాల్సిందిగా తనకు ఒక స్వామీజీ చెప్పారని, అందుకనుగుణంగా తాను వ్యవహరించానని వెల్లడించారు.
తాను స్నానం చేసిన ఘాట్ వద్ద కాకుండా చుట్టుపక్కల ఘాట్‌లలో భక్తులు మరణించారని గుర్తుచేశారు. తాను స్నానం చేస్తుంటే డాక్యుమెంటరీ చిత్రీకరణ జరగడం వల్లే పలువురు చనిపోయారని, సినీ దర్శకుడు బోయపాటి శ్రీను అక్కడ ఉన్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, ఆ సమయంలో ఆయన విదేశాల్లో ఉన్నారని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం.
తెలుగుదేశం శాసనసభా పక్ష(టీడీఎల్పీ) సమావేశం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. అంతకు ముందు ఉదయం 7.30 గంటల నుంచి 9 గంటల వరకూ దుర్ముహూర్తం ఉండడంతో 7.20 గంటలకే ఎన్టీఆర్ ఘాట్‌లో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలతో కలిసి నివాళులు అర్పించి అసెంబ్లీకి చేరుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. బీఏసీ సమావేశంలో సోమవారం ఉదయం స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన జరగనుంది.