గ్రీన్కార్డ్ హోల్డర్స్పై ట్రంప్ నిషేధ ప్రభావముందా?
వాషింగ్టన్ : ఏడు ఇస్లామిక్ దేశాల నుంచి అమెరికాలోకి వలసలను నిషేధిస్తూ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీచేసిన ఆదేశాలను ఎలా అమలు చేయాలో అర్థంకాక ఎయిర్పోర్టు అధికారులు, ఏజెన్సీలు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఏడు దేశాలపై విధించిన ఈ నిషేధం గ్రీన్కార్డు హోల్డర్స్, ద్వంద్వ పౌరసత్వం ఉన్న వారికి ఎలా వర్తింపచేయాలో తెలియక తికమక పడుతున్నారు. ఈ సందిగ్థత సమయంలోనే ట్రంప్ కార్యాలయంలోని టాప్ అధికారులు చేస్తున్న వ్యాఖ్యలు మరిన్ని అనుమానాలను జోడిస్తున్నాయి.
ట్రంప్ ఆర్డర్లు గ్రీన్కార్డు హోల్డర్స్పై ఎలాంటి ప్రభావం చూపదంటూనే, నిషేధించిన ఇరాన్, ఇరాక్, సిరియా, సూడాన్, లిబియా, యెమెన్, సోమాలియా దేశాలకు చెందిన గ్రీన్కార్డు హోల్డర్స్పై ఈ ప్రభావం తప్పక ఉంటుందని వైట్హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ రైయిన్స్ ప్రీబస్ పేర్కొన్నారు. ఏడు దేశాలకు చెందిన గ్రీన్ కార్డు హోల్డర్స్కు ట్రంప్ ఆదేశాలను అమల్లోకి తెస్తామని మరో సీనియర్ అధికారి చెబుతున్నారు. కానీ అమెరికాకు తిరుగు ప్రయాణమై వచ్చే గ్రీన్ కార్డు హోల్డర్స్కు అదనపు స్క్రీనింగ్, ల్యాండింగ్ సమయంలోనే జాతీయ భద్రత తనిఖీలు నిర్వహించి దేశంలోకి అనుమతిస్తామని మరో హోమ్లాండ్ సెక్యురిటీ అధికారి చెబుతున్నారు.