‘సేవల’పై నీలినీడలు: హెచ్‌ఎస్‌బీసీ
న్యూఢిల్లీ: దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో దాదాపు 60 శాతం ఉన్న సేవల రంగం మే నెలలో అసలు వృద్ధి లేకపోగా క్షీణతను నమోదుచేసుకుంది. ఇలాంటి పరిస్థితి గడిచిన 13 నెలల్లో ఇదే తొలిసారి. హెచ్‌ఎస్‌బీసీ ఇండియా సర్వీసెస్ బిజి నెస్ యాక్టివిటీ ఇండెక్స్ ఏప్రిల్‌లో 52.4 పాయింట్ల వద్ద ఉంటే మేలో ఈ పాయింట్లు 49.6కు పడిపోయాయి. ఆర్డర్లు తగ్గడం, పెరిగిన ధరలు వంటివి దీనికి కారణమని హెచ్‌ఎస్‌బీసీ పేర్కొంది. తాజా హెచ్‌ఎస్‌బీసీ ఇండియా సర్వీస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ ఫలితం క్షేత్ర స్థాయిలో వాస్తవ ఆర్థిక అభివృద్ధిపై సందేహాలను లేవనెత్తుతోంది. కాగా తయారీ, సేవల రంగాలు రెండింటికీ సంబంధించి కాంపోజిట్ హెచ్‌ఎస్‌బీసీ ఇండెక్స్ కూడా మేలో ఏడు నెలల కనిష్ట స్థాయికి పడింది. ఏప్రిల్‌లో ఈ పాయింట్లు 52.5 వద్ద ఉండగా, మేలో 51.2కు తగ్గింది. 50 పాయింట్ల పైన హెచ్‌ఎస్‌బీసీ సూచీ ఉంటే, అది సానుకూలంగానే భావించడం జరుగుతుంది. 50 పాయింట్ల లోపునకు పడిపోతే అది క్షీణతకు ప్రతిబింబం.