ముగిసిన రెండు రోజుల ప్రదర్శన
ఉత్సాహంగా పాల్గొన్న జంటనగరాల వాసులు
సాక్షి, హైదరాబాద్: ప్రజలు ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేసి.. వారిలో ఆరోగ్య స్పృహ పెంచే ఉద్దేశంతో భాగ్యనగరంలో నిర్వహించిన సాక్షి లివ్ వెల్ ఎక్స్‌పో కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. ‘సాక్షి’ మీడియా, డీఎస్ రీసెర్చ్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన రెండు రోజుల ‘లివ్ వెల్ ఎక్స్‌పో’ ఆదివారం సాయంత్రం ముగిసింది. జంట నగరాల్లోని వివిధ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులు, దంత, నేత్ర, హెయిర్, ఆయుర్వేద, హోమియో, యునానీ ఆస్పత్రులు ఈ ఎక్స్‌పోలో తమ స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి.
ఇక్కడ ప్రదర్శించిన ఉత్పత్తులను, అందిస్తున్న ఉచిత సేవలను వినియోగించుకునేందుకు ప్రజలు బారులు తీరారు. రెండో రోజైన ఆదివారం టెన్‌కె రన్ వ్యవస్థాపకురాలు ఉమా చిగురుపాటి, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేచురోథెరపీ నిపుణులు అజింక్యా పవార్, యోగా నిపుణురాలు జర్నామోహన్, ప్రముఖ వక్త నీలిమాభట్, జుంబా ట్రైనర్ విజయ తదితరులు ఎక్స్‌పోలో పాల్గొన్నారు. ప్రజలు రోగాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటిం చాల్సిన చిట్కాలను వారు వివరించారు.
జుంబా డ్యాన్స్ బాగుంది
వివిధ పనులతో ఒత్తిడికి లోనవుతున్న వారికి జుంబా డ్యాన్స్ చాలా ఉపయోగకరంగా ఉంది. చిన్న చిట్కాలు, వ్యాయామాలతో ఒత్తిడిని తొలగించుకోవచ్చు. ‘స్ట్రెస్ టు స్వస్థ్’పై నీలిమా భట్ ఇచ్చిన సందేశం చాలా బాగుంది. ప్రతి ఒక్కరికీ అవసరమైన ఆహార పదార్థాలను, వ్యాయామాలను చేసే విధానాలను వివరంగా తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు అందరికీ ఉపయోగకరంగా ఉంటాయి.
- మురళి, చందానగర్
స్టీవియా మొక్క ఉపయోగం
స్టీవియా మొక్కను కొనుగోలు చేశాను. ఈ మొక్క పెరిగిన తర్వాత వాటి ఆకులను చూర్ణంగా చేసుకుని వాడటం వల్ల రోగాలను నివారించవచ్చు. స్థూలకాయం, అజీర్ణం, నోటి వ్యాధులు, వాతరోగాలు, కీళ్ల నొప్పులు, ఆస్తమా, రక్తపోటు, జుట్టు రాలడం లాంటి సమస్యల నుంచి రక్షించుకోవచ్చు. ఈ మొక్క ఆకులు తియ్యగా ఉంటాయి. దీని విలువ 30 రూపాయలు మాత్రమే.
- రజిని, బీహెచ్‌ఈఎల్
సైంధవ లవణం మంచిది
ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన.. అత్యధిక పరిమాణంలో ఉండే సైంధవ లవణం(ఉప్పు) గనులు హిమాలయాల్లో ఉన్నాయి. సైంధవ లవణం ప్రకృతి ప్రసాదితం. దీనిని వాడటం వల్ల పక్షవాతం, థైరాయిడ్, బీపీ, చక్కెర వ్యాధి, కీళ్ల సమస్యలు వంటివి తలెత్తవు. సైంధవ లవణం రాయిని ఇంట్లో, ఆఫీస్‌లో, టేబుల్‌పై పెట్టుకుంటే పాజిటివ్ శక్తిని ఇస్తుంది. వాస్తుదోష నివారిణి. ఇంట్లోని గాలిని శుద్ధి చేస్తుంది.
- ప్రవీణ్ కుమార్
ఆరోగ్య చిట్కాలు బాగున్నాయి
ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాల్స్ నిర్వాహకులు చెపుతున్న ఆరోగ్య సూత్రాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. పెరటి మొక్కల ఉపయోగం చాలా ఉంది. అమ్మమ్మలు, నానమ్మలు చేసే సున్నుండలు, బెల్లంపట్టీలు లాంటి సంప్రదాయ వంటకాల్లో ఎన్నో పోషకాలుండేవి. అవి వదిలేసి పోషకాల కోసం ఖరీదైన పదార్థాల కోసం వెతుకుతున్నారు. మట్టికుండల్లో వంటలు, పెరట్లో పెరిగే పంటలు ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం.
- లలిత, హబ్సిగూడ
సాక్షి ‘లివ్ వెల్ ఎక్స్‌పో’కు భారీ స్పందన
Published Mon, Aug 10 2015 2:29 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
Advertisement
Advertisement