కల ఫలించింది.. దీక్ష విరమించారు!
ఢిల్లీ: గత కొంతకాలంగా ఒకే పింఛను-ఒకే హోదా(వన్ పెన్షన్-వన్ ర్యాంక్) కోరుతూ నిరాహార దీక్ష చేపట్టిన మాజీ సైనికులు ఆదివారం తమ దీక్షను విరమించారు. గత కొద్ది రోజులుగా జంతర్ మంతర్ వద్ద మాజీ సైనికులు నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. 42 ఏళ్లుగా ఎదురుచూసిన వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం శనివారం ఆమోదించింది. ఈ సందర్భంగా కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన మాజీ సైనికులు.. తమ డిమాండ్లు పూర్తిస్థాయిలో నెరవేరిన తర్వాతే దీక్ష విరమిస్తామని చెప్పారు.
కానీ, అంతకుముందే దీక్ష విరమించారు. ఈ సందర్భంగా దీక్ష చేపట్టిన ముగ్గురు ప్రముఖులు జంతర్ మంతర్ వద్ద భోజన కార్యక్రమం పూర్తి చేశారు. రక్షణ మంత్రి మనోహర్ పారిక్కర్ శనివారం మధ్యాహ్నం ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వన్ ర్యాంక్ వన్ పెన్షన్ 2014 జూలై ఒకటో తేదీ నుంచి అమలయ్యేలా అమలుచేస్తామని చెప్పిన విషయం తెలిసిందే.