షాంఘైలో మూసేసిన గేటు వద్ద ఆహారం కోసం ఎదురుచూస్తున్న స్థానికురాలు
షాంఘై: చైనాలోని అతిపెద్ద నగరం షాంఘైలో పరిస్థితులు భయానకంగా మారాయి. జీరో కోవిడ్ విధానంలో భాగంగా అమలవుతున్న కఠిన ఆంక్షలతో జనం ఆహారం తెచ్చుకునేందుకు కూడా అవకాశం లేకుండాపోతోంది. దీంతో, ప్రజలు ఆకలితో అలమటిస్తూ చనిపోవడం కంటే ఆత్మహత్యే శరణ్యమంటూ ఆక్రందనలు చేస్తున్నా రు. జైలుకెళ్తే అయినా కడుపు నిండుతుందనే ఆశతో తమను అరెస్ట్ చేయండంటూ పోలీసులకు విజ్ఞప్తులు చేస్తున్నారు.
కరోనా బారిన పడిన వారి ఇళ్లలోని పెంపుడు జంతువులను సిబ్బంది కొట్టిచంపుతున్నారు. ఇటువంటి దారుణాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక ఆస్పత్రుల్లో అరకొర వసతులు, చెత్తాచెదారంతో ఇబ్బందులు పడుతున్నామని బాధితులు చెబుతున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దారుణాలకు సంబంధించిన వీడియోలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు తొలగిస్తూ జాగ్రత్తపడుతోంది. షాంఘైలో భారీగా కరోనా కేసులు వెలుగులోకి వస్తుండటంతో మార్చి28వ తేదీ నుంచి కఠినాతి కఠినమైన ఆంక్షలను అమలు చేస్తున్నారు.
దీంతో, నిత్యావసర వస్తువులు లభించక, ఆహారం దొరక్క షాంఘైలోని లక్షలాది మంది ప్రజలు అల్లాడుతు న్నారు. ఇళ్లలోని బాల్కనీలు, కిటికీల్లోంచి అరుపులు, పాటలతో నిరసనలు తెలుపుతున్నారు. ‘కడుపు నింపుకునేందుకు మా వద్ద ఏమీలేదు. మమ్మల్ని కాపాడండి. ఆకలితో బతకడం కష్టంగా ఉంది...’అంటూ అధికారులను వేడుకుంటున్న ట్లున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో కోకొల్లలు కనిపిస్తున్నాయి. అధికారులు సరఫరా చేస్తున్న ఆహార వస్తువులు చాలక మార్కెట్లను లూటీ చేస్తున్న ఘటనలు కూడా ఇటీవల చోటుచేసుకున్నాయి.
మూగ జీవులపై పాశవికం
కరోనా బాధితుల ఇళ్లలో ఉండే పెంపుడు జీవులను అధికారులు వదలడం లేదని నగర వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పెంపుడు జంతువులను సిబ్బంది కొట్టి చంపుతున్నారని చెబుతున్నట్లున్న వీడియోలను జనం సోషల్ మీడియాలో పెడుతున్నారు. షాంఘైలోని పుడోంగ్‌లో ఓ పెంపుడు కుక్కను ఆరోగ్య కార్యకర్త పారతో కొట్టి చంపుతున్న వీడియోను ఇటీవల సీఎన్‌ఎన్ వెలుగులోకి తెచ్చింది. ఇదే కాకుండా, క్వారంటైన్‌లో ఉన్న బాధితుల ఇళ్ల తాళాలను పగులగొట్టి మరీ వారి పెంపుడు జంతువులను చంపేస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.
ఆత్మహత్య శరణ్యం అంటూ..
లాక్‌డౌన్ వేళ ఆకలిచావు కంటే ఆత్మహత్యే శరణ్యం అంటూ టియాంజిన్‌కు చెందిన ఒక వ్యక్తి తన భార్యతో కలిసి అపార్టుమెంట్ కిటికీలో నుంచి దూకి ప్రాణాలు తీసుకున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. చైనాలోనే అత్యంత ధనిక నగరం షాంఘై జనాభా 2.60 కోట్లు కాగా, అక్షరాస్యత 97%. ప్రముఖ పర్యాటక ప్రాంతం డిస్నీల్యాండ్ కూడా ఇక్కడుంది. ఇన్ని ఉన్నా ప్రజలు ఆకలితో ఆత్మహత్యలకు పాల్పడటం, మూగజీవాలను కొట్టి చంపడం వంటి దారుణాలు చోటుచేసుకోవడంపై పాలకులు ఆలోచించాలని అమెరికాలోని మీడియా సంస్థలు అభిప్రాయపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment