హైదరాబాద్కు త్వరలోనే గూగుల్ స్ట్రీట్ వ్యూ
హైదరాబాద్ నగరానికి త్వరలోనే మరో కొత్త ఖ్యాతి లభిస్తోంది. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ నగరానికి 'గూగుల్ స్ట్రీట్ వ్యూ' రానుంది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. గూగుల్ స్ట్రీట్ వ్యూ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ డైరెక్టర్ మాణిక్ గుప్తా, గ్రౌండ్ ట్రూత్ ఇంజనీరింగ్ లీడ్ తుమ్మల నారాయణ తదితరులను కేటీఆర్ బృందం కలుసుకుంది. అమెరికా, కెనడా సహా అనేక యూరోపియన్ దేశాల్లో స్ట్రీట్ వ్యూను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అయితే భారతదేశంలో మాత్రం అది ఇంకా అంతగా అందుబాటులోకి రాలేదు. గూగుల్ మ్యాప్స్ను బట్టి కొంతవరకు మార్గాలు తెలుసుకోగలిగినా కచ్చితంగా ఏ వీధిలో ఎక్కడ ఏ ఇల్లుందో, ఏ షాపుందో అనే వివరాలు మాత్రం ఇంకా రావట్లేదు.
దేశంలోనే తొలిసారిగా ఇప్పుడు హైదరాబాద్ నగరానికి సంబంధించిన 'స్ట్రీట్ వ్యూ' అందుబాటులోకి రాబోతోంది. దాంతో జంట నగరాల్లో ఏ గల్లీలో ఏముందోనన్న విషయం కూడా మనకు అరచేతిలో స్పష్టంగా కనిపిస్తుందన్నమాట. ఇందుకోసం తగిన అనుమతులు తీసుకోడానికి కేంద్ర హోం మంత్రితో చర్చలు జరుపుతున్నామని, త్వరలోనే అనుమతులు రావొచ్చని కేటీఆర్ తెలిపారు. త్వరలోనే తెలంగాణలోని ఇతర ప్రధాన నగరాలు, పట్టణాలను కూడా దీని పరిధిలోకి తెస్తామన్నారు.
భవన నిర్మాణ ప్లాన్ల అతిక్రమణలు, ఆస్తిపన్ను వసూళ్లు, పారిశ్రామిక ల్యాండ్ బ్యాంక్ లాంటి అవసరాలకు కూడా గూగుల్ స్ట్రీట్ వ్యూ నుంచి తగిన సపోర్ట్ అందించేందుకు గూగుల్ అంగీకరించింది. గతంలో కూడా స్ట్రీట్ వ్యూ భారతదేశంలో ప్రవేశించేందుకు ప్రయత్నాలు జరిగినా.. అప్పుడు కొన్ని నియంత్రణలు అడ్డంగా నిలిచాయి.