టాప్ గేర్ లో హ్యుందాయ్...
చెన్నై: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీదారు హ్యుందాయ్ అక్టోబర్లో టాప్ రేంజ్ లో దూసుకుపోయింది. ఒకవైపు ప్రధాన ప్రత్యర్థి మారుతి అమ్మకాల్లో క్షీణతను నమోదుచేయగా హ్యుందాయ్ గరిష్ట అమ్మకాలను నమోదు చేసింది. 64,372 యూనిట్లు విక్రయంతో రికార్డ్ స్థాయి అమ్మకాలను నమోదు చేసినట్టు హ్యుందాయ్ మోటార్ ఇండియా ఒక ప్రకటనలో వెల్లడించింది. దేశీయంగా 50,016 వాహనాలు అమ్మగా, 14,356 వాహనాలను ఎగుమతి చేసింది.
గత ఏడాది ఇదే సమయంలో 61,701 యూనిట్ల (దేశీయ 47,105 యూనిట్లు, ఎగుమతులు 14,686 యూనిట్లు) విక్రయించింది. 15 నెలల్లో దేశీయంగా అత్యధిక , వేగవంతమైన అమ్మకాలు సాధించినట్టు హ్యుందాయ్ ఎండీ, సీఈవో వైకే కూ ప్రకటించారు. 50,000 యూనిట్ల గరిష్ట అమ్మకాలతో, గత 40 వేల అమ్మకాల మైలురాయిని అధిగమించినట్టు చెప్పారు.
మరోవైపు ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారు మోడల్ గా ఉన్న మారుతి సుజుకి అక్టోబర్ అమ్మకాలు క్షీణించాయి. గడచిన అక్టోబరులో ఆల్టో అమ్మకాలు 9.8 శాతం తగ్గాయి. గత సంవత్సరం పండగ సీజనులో 37,595 ఆల్టో యూనిట్లు విక్రయం కాగా, ఈ సంవత్సరం 33,929 యూనిట్లు అమ్ముడయ్యాయని మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఓ ప్రకటనలో తెలిపింది.