
భర్త చాటు భార్యగా ఉండటమే ఇష్టం: హీరోయిన్
సహజమైన నటనకు పేరొందిన ఈ అమ్మడి పుట్టినరోజు శనివారం.
90వ దశకాన్ని ఒక ఊపు ఊపి.. బాలీవుడ్ రారాణిగా వెలుగొందిన నటి కాజోల్. సహజమైన నటనకు పేరొందిన ఈ అమ్మడి పుట్టినరోజు శనివారం. 43వ వసంతంలో అడుగుపెట్టిన కాజోల్ తాజాగా 'విఐపీ-2' చిత్రంతో ప్రేక్షకులను పలుకరించబోతున్న సంగతి తెలిసిందే.
తాజాగా 'మిడ్-డే' పత్రికతో మాట్లాడిన కాజోల్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వచ్చే సెప్టెంబర్‌లో తన సొంత ప్రొడక్షన్ సంస్థను ప్రారంభిస్తానని చెప్పిన ఆమె ఇప్పుడా ఆలోచనను మానుకున్నట్టు చెప్పారు. ఇప్పుడు అలాంటి ఆలోచనలేవీ లేవని తెలిపారు.
'ఏదైనా సహజంగా చేయాలని అనిపిస్తేనే నేను చేస్తాను. అంతేకానీ బలవంతంగా ఎందుకు చేయాలి?' అని ఆమె పేర్కొన్నారు. భర్త, నటుడు, నిర్మాత అజయ్ దేవగణ్ నిర్మాణ సంస్థను బలోపేతం చేయడంపైనే ప్రస్తుతం తాను దృష్టి సారించినట్టు చెప్పారు. 'అజయ్ దేవగణ్ ఫిలింస్ (ఏడీఎఫ్) నుంచి దూరం జరగాల్సిన అవసరం నాకు కనిపించడం లేదు. చిత్ర నిర్మాణం గురించి ఆయనకు నా కంటే బాగా తెలుసు. ఈ విషయంలో భర్త చాటు భార్యగా ఉండటమే నాకు ఇష్టం' అని ఆమె వివరించారు. అయితే, అజయ్ అడిగితేనే ప్రొడక్షన్ విషయంలో తన సలహాసూచనలు ఇస్తానని ఆమె స్పష్టం చేశారు. ప్రొడక్షన్‌ను అజయ్ బాగా మనేజ్ చేయగలరని కితాబిచ్చారు. అజయ్ దేవగణ్ ఇటీవల నిర్మించిన శివాయ్ (2016) పెద్దగా విజయం సాధించని సంగతి తెలిసిందే. ఈ సినిమా వైఫల్యం ప్రభావం తన భర్తపై కొద్దిగా పడిందని, అయినా, మరిన్ని ప్రాజెక్టులు సొంతంగా చేపట్టడానికి ఆయన సిద్ధమవుతున్నారని చెప్పారు.