గాసిప్స్ పట్టించుకోను
చెన్నై : గాసిప్స్‌ను కేర్ చేయను అంటున్నారు నటి శ్రుతిహాసన్. అలాగే ఒక భాషకు చెందిన నటిననిపించుకోవడానికి ఇష్టపడనంటున్న ఈ క్రేజీ హీరోయిన్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. ఎంత బిజీ అంటే అజిత్ చిత్ర యూనిట్ ఈ బ్యూటీ కోసం ఎదురు చూసేంత. అవును తమిళం, తెలుగు, హిందీ భాషలో నటిస్తున్న శ్రుతిహాసన్ కాల్‌షీట్స్ కోసం వేదాళం చిత్ర యూనిట్ ఎదురు చూస్తోందని సమాచారం.
ఇలా మూడు భాషలు ఆరు చిత్రాలు అన్నట్లుగా పరుగులు తీస్తున్న శ్రుతి అసలు తను నటినవుతాననే ఊహించలేదట. కాకతాళీయంగా నటినయి సంగీతం, గానానికి దూరం అయ్యానంటున్నారు. దీనిగురించి శ్రుతిహాసన్ తెలుపుతూ చిన్న వయసు నుంచే సంగీతం, గానం అటే ఆసక్తి ఏర్పడందన్నారు. అలాంటిది ఇప్పుడు ఫుల్‌టైమ్ నటిగా మారడంతో ఆ రెండింటికీ దూరం కావలసి వస్తోందన్నారు.
అక్కడికీ సందర్భం కుదిరినప్పుడల్లా పాడ డపై ఆసక్తి చూపుతున్నానని అన్నారు. ప్రస్తుతం అజిత్‌తో వేదాళం, సూర్య సరసన సింగం-3 చిత్రాల్లోనటిస్తున్నానని తెలిపారు. అదేవిధంగా తెలుగు, హిందీ భాషల్లోనూ కొత్త చిత్రాలున్నాయని చెప్పారు. ఇలా అన్ని భాషల్లోనూ నటించాలని కోరుకుంటున్నానన్నారు. ఏ ఒక్క భాషలోనో నటించడం తనకిష్టం అని చెప్పనన్నారు.
కోలీవుడ్, టాలీవుడ్, శాండిల్‌వుడ్, బాలీవుడ్ అంటూ విడి విడిగా చెప్పడం కూడా తనకు నచ్చదన్నారు. కారణం తాను ఇండియా వాసినని పేర్కొన్నారు.అందువల్ల అన్ని భాషా చిత్రాలను కలిపి భారతీయ సినిమా అనడాన్ని గర్వంగా భావిస్తానని అన్నారు. హాలీవుడ్, చైనా చిత్రాలనే తీసుకుంటే హాలీవుడ్ లేదా చైనీస్ చిత్రాలనే అంటారన్నారు.ఇక్కడ మనం మాత్రమే ఆ వుడ్ చిత్రం ఈ వుడ్ చిత్రం అంటున్నామని అన్నారు.
తన చిత్రాల విషయంలో తన తండ్రి కమల హాసన్ సలహాలు తీసుకుంటారా? అని చాలా మంది అడుగుతుంటారని,నాన్న సూచనలు తీసుకోవడానికి వెళ్లినా ఆయన తననే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోమని చెబుతారని అన్నారు. తనపై చెల్లి అక్షరహాసన్ పై నాన్నకంత నమ్మకం అని పేర్కొన్నారు. నాన్నతో కలిసి నటిస్తారా? అని చాలా మంది అడుగుతున్నారని ఒకసారి అలాంటి అవకాశం వచ్చినా నటించలేకపోయానని అన్నారు. కారణం అప్పుడు తాను హిందీ చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్నానని వివరించారు.
తనపై వదంతులూ బాగానే ప్రచారం అవుతున్నాయని అయితే వాటి గురించి పట్టించుకోనని అన్నారు.అసలు బాధ పడనని చెప్పారు. తమది పెద్ద సినిమా కుటుంబం. తనకు పనే ముఖ్యం అని అన్నారు. తానూ నాన్నంత పేరు తెచ్చుకోవాలి. ఇప్పుడు అదే తన లక్ష్యం అని శ్రుతిహాసన్ అన్నారు.