
షరీఫ్ అనర్హత తీర్పుపై మీడియాతో మాట్లాడుతున్న ఇమ్రాన్
‘వారెవా.. పొలిటికల్ యార్కర్లతో షరీఫ్ వికెట్ విరగొట్టాడు..’ అంటూ ఇమ్రాన్‌ఖాన్‌ను ఆకాశానికెత్తేశారు.
- మాజీ క్రికెటర్, పీటీఐ చీఫ్ ఇమ్రాన్‌కు విపక్షాల కితాబు
- ఆయన పోరాటం వల్లే షరీఫ్‌పై అనర్హత వేటు
ఇస్లామాబాద్: ‘దేశం యావత్తూ ఇవాళ పండుగ జరుపుకొంటోంది. మిగతా దేశాల మాదిరే మనం కూడా అభివృద్ధిలో ముందుకు వెళ్లగలమనే నమ్మకం వల్ల కలిగిన ఆనందమిది..’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు మాజీ క్రికెటర్, పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్(పీటీఐ) వ్యవస్థాపక అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్. శుక్రవారం నాటి సుప్రీంకోర్టు తీర్పుతో నవాజ్ షరీఫ్ ప్రధానమంత్రి పదవి కోల్పోవడంపై ఆయన ఈ విధంగా స్పందించారు.
పాక్ భవితవ్యాన్ని ప్రభావితం చేయగల ఈ తీర్పును వెలువరించిన న్యాయమూర్తులు ‘నిజమైన హీరో’లని, ఇక దేశంలో ‘గాడ్ ఫాదర్’ పాలన అంతమైపోయిందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. తీర్పు వెలువడిన అనంతరం పాకిస్తాన్‌లోని పలు పట్టణాల్లో పీటీఐ సంబరాలు జరుపుకొంది. అవినీతికి వ్యతిరేక పోరాటంలో కలిసివచ్చిన ప్రజలు, జర్నలిస్టులు, లాయర్లకు పీటీఐ ధన్యవాదాలు తెలిపింది.
మరో విపక్షపార్టీ జమాత్ ఎ ఇస్లామీ(జేఐ) నాయకుడు సిరాజ్ ఉల్ హక్ అయితే.. ‘వారెవా.. పొలిటికల్ యార్కర్లతో షరీఫ్ వికెట్ విరగొట్టాడు..’ అంటూ ఇమ్రాన్‌ఖాన్‌ను ఆకాశానికెత్తేశారు. నవాజ్ షరీఫ్ వేల కోట్లు విలువచేసే అక్రమాలకు పాల్పడినట్లు పనామా పేపర్ల ద్వారా వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ప్రధానికి వ్యతిరేకంగా ఇమ్రాన్ నిరంతరాయ న్యాయ, ప్రజా పోరాటాలు చేశారు. పనామా లీకేజీలపై ఇమ్రాన్ గత అక్టోబర్‌లో పాక్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీమ్(జిట్) ఏర్పాటయింది. జిట్ నివేదికపై సమగ్ర వాదనలు విన్న కోర్టు.. చివరికి షరీఫ్ అనర్హుడంటూ తీర్పుచెప్పింది. పాక్ తరువాది ప్రధాని ఎవరనేదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.