నాది తప్పే..!
పాట్నా: అనుమతించిన ప్రవేశ ద్వారం నుంచి కాకుండా వేరే మార్గం ద్వారా తనను పంపించాలని వాదనలు చేసిన కేంద్ర మంత్రి రామ్ కృపాల్ యాదవ్ అనంతరం తనను తాను నిందించుకున్నారు. తాను అలా చేయడం ఏ మాత్రం సరికాదని, తనది ముమ్మాటికీ తప్పేనని ఒప్పుకున్నారు. ఇప్పటికే వీఐపీల సంస్కృతిపై తీవ్ర వివాదం నెలకొన్న నెలకొన్న నేపథ్యంలో తాజాగా ఎంపీ విషయం చర్చనీయాంశం అయింది.
బీహార్లోని పాట్నా విమానాశ్రయంలో మరో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను రిసీవ్ చేసుకునేందుకు మంత్రి రామ్ కృపాల్ వెళ్లారు. ఆయన ఎగ్జిట్ (బయటకు) మార్గం ద్వారా వెళుతుండగా అక్కడ ఉన్న ఓ మహిళా అధికారి అడ్డుకొని అందరిలాగే (ఎంట్రీ) ప్రవేశ ద్వారం వెళ్లాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే తన ఉద్యోగం పొతుందని కూడా చెప్పారు. అయినప్పటికీ ఆయన ఆమెతో కాసేపు స్వల్ప వాదోవాదాలకు దిగడంతో ఆమె పై అధికారులను కూడా సంప్రదించాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడం, దానిపై విమర్శలు కూడా తలెత్తడంతో కేంద్ర మంత్రి వివరణ ఇచ్చుకున్నారు. విధులు సక్రమంగా నిర్వహించిన ఆ అధికారిని మెచ్చుకున్నారు కూడా