ఐడియా ఆఫర్ అదుర్స్
న్యూఢిల్లీ : టెలికాం సెక్టార్ లో సంచలనానికి సిద్ధమవుతున్న రిలయన్స్ జియో పోటీని తట్టుకునేందుకు మిగతా టెలికాం సంస్థలు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. మొన్న హ్యాపీ అవర్స్ డేటాతో అతిపెద్ద టెలికాం కంపెనీ ఎయిర్ టెల్ వినియోగదారుల ముందుకు రాగా.. ఇపుడు ఆ కోవలోకి మరో టెలికాం దిగ్గజం ఐడియా కూడా చేరిపోయింది. డేటా ప్యాక్ రేట్లలో 45శాతం కోత విధిస్తున్నట్టు ఐడియా సెల్యులార్ శుక్రవారం ప్రకటించింది. దేశంలోనే మూడో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ గా ఉన్న ఐడియా తన ప్రీ పెయిడ్ కస్టమర్లకు ఈ ఆఫర్ ను అందిస్తున్నట్టు తెలిపింది. జీయో దీటుగా....తమ ఖాతాదారులను నిలబెట్టుకునేందుకు, కొత్త వారిని ఆకర్షించేందుకు ఐడియా ఈ సేవలను ఆవిష్కరించింది.
175 మిలియన్ యూజర్లు కలిగి ఉన్న ఐడియా సెల్యులార్, తన 4జీ, 3జీ, 2జీ యూజర్లకు 1జీబీ డేటాలో 45 శాతం డేటా రాయితీని అందించనుంది. ఇప్పటివరకూ మూడు రోజుల 75ఎంబీ డేటాకు రూ.19 లు చార్జ్ చేసేవారు. అయితే ఈ 45శాతం ఆఫర్ కింద అదే చార్జ్ మీద 110ఎంబీ డేటాను ఇకనుంచి కస్టమర్లు పొందుతారు. అదేవిధంగా 4జీ/3జీ డేటా ప్యాక్ లో రూ.22లకు 65ఎంబీ డేటాను మూడు రోజుల పాటు వినియోగదారులు పొందేవారు. ప్రస్తుతం ..90ఎంబీ డేటాను వినియోగదారులు వాడుకోవచ్చు. దీంతో 38శాతం ఎక్కువ డేటా సౌకర్యాన్ని కస్టమర్లకు అందుతాయి.
రూ.8 నుంచి రూ.225 ల మధ్య విస్తృతమైన సాచెట్ డేటా ప్యాక్స్ ను కూడా ఐడియా ప్రకటించింది. ఈ డేటా ప్యాక్ ఆఫర్లు అన్ని సర్కిల్స్ లో శుక్రవారం నుంచి అందుబాటులో ఉంటాయని ఐడియా తెలిపింది. గురువారమే ఎయిర్ టెల్ కూడా తన ప్రీ పెయిడ్ కస్టమర్లకు ఉదయం 3 గం.ల నుంచి 5 గంటలకు వరకు వినియెగించే డేటాలో 50 శాతం తిరిగి ఆఫర్ చేస్తోంది. ఈ సమయంలో చేసుకున్న కంటెంట్ డౌన్ లోడ్ పై 50 డేటా బ్యాక్ ఆఫర్ చేస్తున్నట్టు ఎయిర్ టెల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.