పాకిస్థాన్కు భారత్ వార్నింగ్
న్యూఢిల్లీ: పాకిస్థాన్ సైన్యం భారతీయులను చంపితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హెచ్చరించారు. పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత శిబిరాలపై దాడి చేస్తున్నందుకు ప్రతిచర్యగా, బీఎస్ఎఫ్ జవాన్లు 14 పాక్ సైనిక స్థావరాలను ధ్వంసం చేయడాన్ని గుర్తుచేస్తూ, ఆ దేశానికి ఇది ఓ హెచ్చరిక అని జైట్లీ చెప్పారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం సర్జికల్ దాడులు చేసిన తర్వాత పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని 60 సార్లు ఉల్లంఘించింది. నిత్యం భారత్ శిబిరాలపై కాల్పులు జరుపుతోంది. ఇందుకు భారత సైన్యం దీటుగా స్పందిస్తోంది. భారత జవాన్ల కాల్పుల్లో భారీ ఎత్తున పాక్ రేంజర్లు చనిపోయారు. సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. శాంతంగా ఉండటం వల్ల నష్టపోయామని, ఇకమీదట ఆ పరిస్థితి ఉండదని పేర్కొన్నారు. పాక్ దాడులకు భారత సైన్యం దీటైన సమాధానం ఇస్తుందని చెప్పారు. పాకిస్థాన్లో అంతర్గత పరిస్థితి అస్థిరంగా ఉందని చెప్పారు.