కోలుకోలేని దెబ్బతీస్తాం..!
కవ్వింపు చర్యలపై పాక్‌కు భారత్ తీవ్ర హెచ్చరిక
సరిహద్దులో కొనసాగుతున్న కాల్పులు
ముగ్గురు జవాన్లు సహా 12 మంది గాయాలు
భయంతో సొంతూళ్లను వదులుతున్న ప్రజలు
జమ్మూ/న్యూఢిల్లీ: కాల్పుల విరమణ ఒప్పందాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ.. సరిహద్దు వెంట విచక్షణారహిత కాల్పులను కొనసాగిస్తున్న పాకిస్తాన్‌ను భారత్ గట్టిగా హెచ్చరించింది. ఇదే దుస్సాహసాన్ని కొనసాగిస్తే.. కోలుకోలేని దెబ్బ తీస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది. ‘ఇదే దుందుడుకుతనాన్ని కొనసాగిస్తే.. దానికి మీరు మూల్యం చెల్లించుకోలేని స్థాయిలో మా దళాల ప్రతిస్పందన ఉంటుంది’ అని భారత రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ పాకిస్తాన్‌ను తీవ్రంగా హెచ్చరించారు. భారత దళాల ప్రతిస్పందనను ఉద్దేశిస్తూ.. భారత్ సందేశం పాక్‌కు చేరిందని న్యూఢిల్లీలో జైట్లీ వ్యాఖ్యానించారు. సరిహద్దుల్లో శాంతి కోరుకుంటే తక్షణమే కాల్పులను ఆపేయాలని పాక్‌కు స్పష్టం చేశారు. ఒకవైపు కాల్పులు కొనసాగుతుండగా.. ఆ దేశ నేతలతో చర్చలు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. భారత్ దురాక్రమణదారు కాదని, తన భూభాగాన్ని, తన ప్రజలను రక్షించుకోవాల్సిన బాధ్యత భారత్‌పై ఉందని అన్నారు. పాక్ దుశ్చర్యల వెనక కారణమేమై ఉండొచ్చన్న విలేకరుల ప్రశ్నకు జైట్లీ సమాధానమిస్తూ.. కాల్పుల ముసుగులో ఉగ్రవాదుల చొరబాటుకు పాక్ సైన్యం ప్రయత్నిస్తుండొచ్చన్నారు. భారత్‌కు ఎవరికీ తలవంచే ప్రసక్తే లేదని హోమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రధాని సమీక్షిస్తున్నారని, దీనిపై ప్రధానే మాట్లాడాల్సిన అవసరం లేదని.. బీఎస్‌ఎఫ్, ఆర్మీ దీటుగా స్పందిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఇరువైపులా హోరాహోరీ..
పాక్ దాడులు, భారత్ ఎదురుదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. జమ్మూ, సాంబ, కతువ జిల్లాల్లోని సరిహద్దుకు దగ్గరలో ఉన్న 130 గ్రామాలు, 60 సరిహద్దు సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని పాక్ రేంజర్లు బుధవారం రాత్రంతా జరిపిన దాడుల్లో ముగ్గురు బీఎస్‌ఎఫ్ జవాన్లు సహా 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్వల్ప విరామాలతో పర్గ్వాల్, కనచక్, ఆర్నియా, రామ్‌గఢ్ సబ్ సెక్టార్లలో గురువారం రాత్రి వరకు కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. 2003 కాల్పుల విరమణ ఒప్పందం తరువాత ఆ ఒప్పంద ఉల్లంఘన ఈ స్థాయిలో జరగడం ఇదే ప్రథమమని భావిస్తున్నారు. అక్టోబర్ 1వ తేదీనుంచి ఎలాంటి హెచ్చరికలు లేకుండా పాక్ ప్రారంభించిన దాడుల్లో 8 మంది చనిపోగా, 9 మంది సైనిక సిబ్బంది సహా 80 మంది గాయాలపాలయ్యారు. 60 బీఎస్‌ఎఫ్ సరిహద్దు కేంద్రాలు ధ్వంసమయ్యాయి. 113 సరిహద్దు గ్రామాల్లోని 30 వేల మందికి పైగా ప్రజలు సొంతూళ్లను వదిలి రక్షణ కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు.
మాకూ ఆ సామర్ధ్యం ఉంది: పాక్
ఇస్లామాబాద్: భారత్‌వైపు నుంచి జరిగే ఎలాంటి దురాక్రమణను అయినా ఎదుర్కొనే సత్తా పాకిస్తాన్‌కు ఉందని ఆ దేశ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ గురువారం స్పష్టం చేశారు. సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఈ ఉద్రిక్తతలు రెండు అణ్వాయుధ దేశాల మధ్య ఘర్షణకు దారితీయకూడదని తాము కోరుకుంటున్నామని వ్యాఖ్యానించారు. ‘భారత్ జాగ్రత్తగా ఉండాలి. బాధ్యతాయుతంగా వ్యవహరించాలి’ అన్నారు. భారత రక్షణమంత్రి జైట్లీ ఘాటుగా స్పందించిన నేపథ్యంలో అయన పైవిధంగా వ్యాఖ్యానించారు.