ప్రతీకార కాల్పులు మా హక్కు
పాక్‌కు స్పష్టం చేసిన భారత డీజీఎంవో
న్యూఢిల్లీ/శ్రీనగర్: పాకిస్తాన్ సైనికులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే అందుకు ప్రతీకారం తీర్చుకునే హక్కు తమకు ఉందని భారత్ పాక్‌కు గట్టి హెచ్చరికలు పంపింది. అదే సమయంలో నియంత్రణ రేఖ వద్ద శాంతిని నెలకొల్పేందుకు భారత్ ఎప్పటికీ కట్టుబడి ఉంటుందంది. సోమవారం సరిహద్దులో కాల్పులు జరిగిన అనంతరం పాకిస్తాన్ మిలిటరీ కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ (డీజీఎంవో) మేజర్ సాహిర్ షంషద్ మీర్జా భారత డీజీఎంవో ఏకే భట్‌కు ఫోన్ చేశారు. భారత దళాలు పాక్ సైనిక శిబిరాలే లక్ష్యంగా కాల్పులు జరుపుతున్నాయని మీర్జా అనడంతో అన్ని సందర్భాల్లోనూ పాక్ సైనికులే కాల్పులతో రెచ్చగొట్టారని భట్ చెప్పారు.
పాక్ కాల్పుల్లో జవాన్, బాలిక మృతి
జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్, రాజౌరీ, బారా ముల్లా జిల్లాల్లో నియంత్రణ రేఖ వద్ద పాక్ సైనికులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో ఓ భారత జవాన్, తొమ్మిదేళ్ల బాలిక మరణించారు. భారత దళాలూ పాక్‌కు దీటుగా బదులిచ్చాయి. పాక్ సైనికులు వేసిన మోర్టార్ బాంబులు నాయక్ అహ్మద్ అనే సైనికుడి బంకర్‌పై పడటంతో ఆయన మరణించారు.