
ఢిల్లీలో వస్తే పరిస్థితేమిటి?
న్యూఢిల్లీ: నేపాల్లో భూకంపం వస్తేనే ఉత్తర భారతమంతా వణికిపోయి కొంత ప్రాణనష్టం, ఆస్తినష్టం చోటుచేసుకుంది. అలాంటిది భూకంప చోటుచేసుకునేందుకు అనుకూలంగా ఉన్న ప్రాంతంలో ఉన్న ఢిల్లీలో భూకంపం వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? అక్కడి నిర్మాణాలు తట్టుకోగలవా? వెంటనే తేరుకుని సహాయక చర్యలతో బయటపడగలమా? ప్రాణ నష్టాన్ని నివారించగలమా? ఇలా ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు అందరిముందు. అయితే, దీనిపై భవన నిర్మాణ ఇంజినీరింగ్లు మాత్రం భూకంపాన్ని ఢిల్లీ ఏమాత్రం తట్టుకోలేదని కుండబద్దలు కొడుతున్నారు.
అక్కడ 80శాతం భవనాలు భూకంపాన్ని తట్టుకోలేని విధంగా ఉన్నాయని, ఈవిషయంలో గత పాలకులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ స్ట్రక్చరల్ ఇంజినీర్స్ అధ్యక్షుడు మహేశ్ టాండన్ అన్నారు. ఒక్కసారి ఢిల్లీలో భూకంపం వస్తే భవనాలు పూర్తిగా నేలమట్టమవుతాయని ఆయన హెచ్చరించారు. ఇది ఆందోళనకర పరిస్థితి అని ఆయన అన్నారు. ఇప్పటికే పరోక్షంగా అనుభవాన్ని పొందిన ఢిల్లీ ఇప్పటికే భవనాల పటిష్టతపై దృష్టిని సారించాలని సూచించారు.