
వాహన రిజిస్ట్రేషన్‌లో TS స్థానంలో TG
- అధికారంలోకి వస్తే రిజిస్ట్రేషన్, రాజముద్రను మార్చేస్తాం
- పార్టీల స్వార్ధం కోసమే తెలంగాణ ఉద్యమం పుట్టింది
- ‘మీట్ ది ప్రెస్’లో టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాహన రిజిస్ట్రేషన్లలో ‘టీఎస్’ స్థానంలో ‘టీజీ’ని ప్రవేశపెడతామని, రాజముద్రను సైతం మార్చేస్తామని ఆ పార్టీ కార్యానిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పారు. కేవలం పార్టీల మనుగడ, రాజకీయంగా స్వార్థం కోసం మాత్రమే తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తెచ్చామని ఆయన అన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో మంగళవారం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’కు హాజరైన రేవంత్ రెడ్డి.. తెలంగాణ ఉద్యమం, టీఆర్‌ఎస్ పరిపాలన, టీడీపీ భవిష్యత్తు తదితర అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘రాజకీయ స్వార్థం కోసమే తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఈ విషయంలో నాకు(రేవంత్‌రెడ్డికి), కేసీఆర్‌కు తేడాలేదు. టీడీపీకి ఏమాత్రం అవకాశం వచ్చినా ముందుగా రాష్ట్ర అధికార గుర్తును తొలగిస్తాం. రాజముద్రలో అమరవీరుల స్తూపం ఉండేలా చూస్తాం. ఈ విషయమై ఇదివరకే నేను లేఖ రాశా. అలాగే, వాహన రిజిస్ట్రేషన నంబర్లపై ఉన్న టీఎస్ తీసేసి.. టీజీ తెస్తాం. తెలంగాణ ఏర్పాటై మూడేళ్లయినా అమరవీరుల స్థూపానికి కేసీఆర్ కొబ్బరి కాయ కొట్టలేదు. కనీసం అమరవీరుల కుటుంబాల కోసం బడ్జెట్ లో ఒక్క శాతం కూడా నిధులు పెట్టలేదు’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణ ఏర్పడకముందు ఎన్నో రాజకీయాలు చేసిన పార్టీలు ఇప్పుడు మారాల్సిన అవసరం ఉందని రేవంత్ అన్నారు. టీఆర్‌ఎస్ ప్రణాళికలు ప్రజలకు అనుకూలంగా లేవని విమర్శించారు. ఉమ్మడి రాష్టంలో తెలంగాణకు బద్ద శత్రువులని ఏ పార్టీలనైతే కేసీఆర్ విమర్శిచారో ఆ కాంగ్రెస్, తెలుగుదేశంలతోనే గతంలో పొత్తులుపెట్టుకున్న విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణ సాధనలో కష్టపడ్డవాళ్లకు టీఆరెస్ బి ఫామ్‌లు ఇవ్వలేదని ఆరోపించారు. ‘ఇప్పుడు ధర్నా చౌక్ తీసేసిన కేసీఆర్ కుటుంబానికి.. అధికారం కోల్పోయిన తర్వాత మళ్లీ అలాంటి ధర్నా చౌక్ ఒకటి కావాలి అని వెదుకునే రోజు వస్తుంద’ని రేవంత్ ఎద్దేవాచేశారు.