
వద్దన్నా.. వినలేదు
మేం వద్దన్నా.. వినలేదు. మొదటి రోజే స్నానం చేస్తే మంచిదన్నారు. అందుకే మేం రాకున్నా వారు వెళ్లారు. వెళ్లి 12 గంటలు గడవక
♦ పుష్కరాలకు వెళ్లి ముగ్గురు జిల్లావాసులు మృతి
♦ ఒక్కరోజు ఆగి ఉంటే బతికేవారు
♦ పుష్కరాల్లో మృతిచెందిన వారి బంధువుల ఆవేదన
♦ విషాదంలో కుటుంబ సభ్యులు.. గ్రామస్తులు
♦ గాయాలతో మరో ఐదుగురు చికిత్సపొందుతున్న వైనం
♦ నేడు ప్రభుత్వ ఆధ్వర్యంలో అంత్యక్రియలు
అందరం కలిసి పుష్కరాలకు వెళ్లాలనుకున్నాం. కొన్ని కారణాలతో నేను ప్రయాణాన్ని విరమించుకున్నా.. మా తమ్ముడి కుటుంబం పుష్కరాల తొలిరోజే అక్కడ ఉండాలని సోమవారం రాత్రి వెళ్లారు. ఉదయం కూడా ఫోన్లో మాట్లాడాను. కొద్దిసేపటికి తొక్కిసలాట జరిగిందని తెలిసింది. ఫోన్లు పని చేయలేదు. టీవీ పెట్టా. రాజేశ్వరమ్మ మృతిచెందిందని తెలిసింది. కన్నీరు ఆగడం లేదు.
- సుబ్బరాయుడు (రాజేశ్వరమ్మ బావ)
నెల్లూరు(క్రైమ్) : ‘మేం వద్దన్నా.. వినలేదు. మొదటి రోజే స్నానం చేస్తే మంచిదన్నారు. అందుకే మేం రాకున్నా వారు వెళ్లారు. వెళ్లి 12 గంటలు గడవక ముందే వారి మరణవార్త వినాల్సి వచ్చింది’ అంటూ గోదావరి పుష్కరాల్లో మంగళవారం జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన వారి బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో మంగళవారం గోదావరి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. పుష్కర స్నానాలు చేసేందుకు జిల్లా నుంచి పెద్దసంఖ్యలో తరలివెళ్లారు. రాజమండ్రి కోటగుమ్మం పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో జిల్లాకు చెందిన పర్వతాల రాజేశ్వరి, కొండూరు జానకమ్మ, ఎల్‌బీ పేరమ్మ మృతిచెందారు. వీరిలో పేరమ్మ వివరాలు తెలియరాలేదు.
పుష్కరాలకు వెళ్లిన వారిలో జిల్లాకు చెందిన మరో ఐదుగురుకి తీవ్రగాయాలతో రాజమండ్రిలో చికిత్సపొందుతున్నట్లు సమాచారం. రాజేశ్వరి మృతదేహం వద్ద ఇద్దరు కుమార్తెలు బోరున విలపిస్తున్నారు. తన కళ్లలో నుంచి ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకొని భర్త పోలయ్య విలపిస్తున్న కుమార్తెలను ఓదారుస్తుండటాన్ని టీవీల్లో చూసి కుటుంబీకులు, బంధువుల దుఖఃసాగరంలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళ్లితే.....నెల్లూరులోని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న పోలీసుకాలనీకి చెందిన పర్వతాల పోలయ్య నెల్లూరు ఆర్టీసీ ఒకటోడిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నారు. భార్య రాజేశ్వరమ్మ(45). వారికి అఖిల, కుసుమ పిల్లలు.
అఖిల ఇంటర్ పూర్తిచేయగా, కుసుమ పదోతరగతి పూర్తిచేసింది. పోలయ్య, రాజేశ్వరిలు భక్తిపరులు. పోలయ్య అన్న పర్వతాల సుబ్బరాయుడు పక్క వీధిలో నివాముంటున్నాడు. సుబ్బరాయుడు, పోలయ్య కుటుంబాలు ఎక్కడ పుష్కరాలు జరిగినా వెళ్లేవారు. అందులోభాగంగా గోదావరి పుష్కరాలకూ అన్నదమ్ములు ఇద్దరు కలిసి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కొన్ని కారణాలతో సుబ్బరాయుడు కుటుంబం వెళ్లలేదు. దీంతో పోలయ్య భార్య, పిల్లలను తీసుకొని సోమవారం రాత్రి నెల్లూరు నుంచి రాజమండ్రికి వెళ్లారు. మంగళవారం ఉదయం జరిగిన అపశ్రుతితో రాజేశ్వరమ్మ మృతిచెందింది. ఈవిషయం తెలుసుకున్న సుబ్బరాయుడు కుటుంబం తీవ్ర ఆందోళనకు గురయ్యారు. స్థానికులు సైతం రాజేశ్వరి మృతి విషయాన్ని జీర్ణించుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు. సుబ్బరాయుడు తన మరదలు, తమ్ముడి ఫొటోను చూపిస్తూ బోరున విలపించడం చూపురులను కంట తడిపెట్టించింది.
బాబానగర్‌లో విషాదఛాయలు
గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాటలో నెల్లూరు రూరల్ మండలం బాబానగర్‌లో నివాసముంటున్న కొండూరు జానకమ్మ(55) మృతిచెందారు. దీంతో బాబానగర్‌లోని ఆమె ఇంటివద్ద విషాదఛాయలు అలముకున్నాయి. జానకమ్మ సొంతూరు ఓజిలి మండలం భువనగిరిపాలెం. కొండూరు లక్ష్మణరాజు, జానకమ్మలు దంపతులకు ఒక్కతే కుమార్తె. ఆమెకు వివాహం చేశారు. నాలుగేళ్ల కిందట లక్ష్మణరాజు, జానకమ్మ దంపతులు ఉపాధి నిమిత్తం నెల్లూరు రూరల్ మండలం బాబానగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని నివాసముంటున్నారు. లక్ష్మణరాజు సమీపంలోని బాబా రైస్ ఇండస్ట్రీస్‌లో గుమస్తాగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు.
సోమవారం ఉదయం లక్ష్మణరాజు, జానకమ్మ, ఆమె అక్క సుబ్బులమ్మతో కలిసి పుష్కరాలకు వెళ్లారు. మంగళవారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో జానకమ్మ మృతిచెందింది. లక్ష్మణరాజు, సుబ్బులమ్మకు తీవ్రగాయాల పాలై రాజమండ్రిలో చికిత్సపొందుత్నుట్లు సమాచారం. జానకమ్మ మృతితో అటు బాబానగర్‌లో, ఇటు ఓజిలి మండలంలోని చిలమానుచేను, భువనగిరిపాళెం గ్రామాలలో విషాదచాయలు అలుముకున్నాయి. లక్ష్మణరాజు పనిచేస్తోన్న రైస్‌మిల్లులోని సిబ్బంది సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఎంతో కలివిడిగా ఉండేది: రత్నమ్మ, స్థానికురాలు
రాజేశ్వరి ఎంతో కలివిడిగా ఉండేది. అందరి సంతోషాలు, సుఖాల్లో పాల్పంచుకొనేది. వారి కుటుంబం ఎంతో అన్యోన్యంగా ఉండేది. గతేడాది ఆగస్టులో కొత్తగా ఇల్లు కట్టుకున్నారు. ఇంకా ఏడాదికూడా కాలేదు. సోమవారం రాత్రి పుష్కరాలకు వెళుతున్నామని చెప్పి వెళ్లింది. టీవీలో పుష్కరాల్లో తొక్కిసలాట జరిగింది రాజేశ్వరి మృతిచెందిందని తెలిసింది. మనస్సుకు చాలా బాధేసింది. రాజేశ్వరికి దేవుడి అంటే భక్తి ఎక్కువ. ఆ భక్తితోనే తొలిరోజే పుష్కరాలను చూడాలని వెళ్లింది. తమతో పాటు వచ్చి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు.