ఈ మార్కెట్లో ఏం చెయ్యాలి?
ప్రస్తుతం మార్కెట్లు గరిష్ట స్థాయికి ఎగిసినప్పటికీ.. సవాళ్లు మాత్రం అలాగే ఉన్నాయి. స్థూల ఆర్థిక పరిస్థితులు అనిశ్చితంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో స్వల్పకాలికంగానైనా.. మధ్యకాలికంగానైనా.. దేశీ మార్కెట్లు మరీ భారీగా పెరిగే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. ప్రపంచ పరిణామాలకు అనుగుణంగా అప్పుడప్పుడు భారీ హెచ్చుతగ్గులకు లోనుకావడం మినహా పరిమిత శ్రేణిలో అక్కడక్కడే తిరుగాడే పరిస్థితి నెలకొంది. మరి.. ఇలాంటప్పుడు రిటైల్ ఇన్వెస్టర్లు ఏయే రంగాల్లో.. ఏయే స్టాక్స్‌పై దృష్టి సారించాలి? అది తెలియజెప్పే ప్రయత్నమిది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో రిటైల్ ఇన్వెస్టర్లు నిర్దిష్ట షేర్లకు పరిమితమైతే మంచిది. ప్రధానంగా ఐటీ, ఫార్మా వంటి ఎగుమతి ఆధారిత రంగాల కంపెనీల వైపు దృష్టి పెట్టొచ్చు. ఎందుకంటే రూపాయి క్షీణించడం వల్ల ఈ సంస్థలకు గణనీయంగా ప్రయోజనం కలుగుతుంది. ఐటీ రంగానికి సంబంధించి.. ఇన్ఫోసిస్, విప్రో, మైండ్‌ట్రీ, కేపీఐటీ కమిన్స్ వంటివి బాగానే ఉన్నాయి. ఇక ఫార్మా రంగం విషయానికొస్తే.. లుపిన్, సన్ ఫార్మా, అలెంబిక్ వంటివి మెరుగ్గా ఉండే అవకాశముంది. అలాగే, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, కన్సూమర్ డ్యూరబుల్స్ వంటి రంగాల్లోనూ కొన్ని స్టాక్స్ దీర్ఘకాలిక ప్రాతిపదికన మంచి రాబడులే అందించగలవు. ఈ జాబితాలో జీ ఎంటర్‌టైన్‌మెంట్, ఐటీసీ వంటివి ఫర్వాలేదు.
వడ్డీ రేట్ల ప్రభావముండే రంగాలకు దూరం...
దేశీయ ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం ఒక రకమైన అనిశ్చితి నెలకొంది. త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల తర్వాతే దీనిపై ఒక స్పష్టత వస్తుందని నా అంచనా. అప్పుడే ఎకానమీ కూడా స్థిరంగా కోలుకునే అవకాశముంది. ఇలాంటివన్నీ కూడా వడ్డీ రేట్లతో ముడిపడి ఉన్న రంగాలపై ప్రభావాలు చూపే అవకాశముంది. కాబట్టి రికవరీ కనిపించే దాకా బ్యాంకులు, రియల్టీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి వడ్డీ రేట్ల ప్రభావిత రంగాల స్టాక్స్‌కు కాస్త దూరంగా ఉండటం మంచిది.
స్టాక్‌మార్కెట్లపై అవగాహన ఉన్న ఇన్వెస్టర్లు.. మార్కెట్లో పటిష్టమైన స్థానంతో పాటు వ్యాపారావకాశాలు, లాభదాయకత మెరుగ్గా ఉన్న సంస్థల షేర్లపైన దృష్టి పెట్టొచ్చు. తక్కువ రుణభారం, ఎక్కువ ఆదా యం వచ్చేవి, ఆకర్షణీయమైన వేల్యుయేషన్స్, సమర్థమంతమైన మేనేజ్‌మెంట్ ఉన్న కంపెనీలను ఎంచుకోవచ్చు.
ఇక మార్కెట్లపై పెద్దగా అవగాహన లేని వారు నేరుగా ఇన్వెస్ట్ చేయడం కాకుండా.. మ్యుచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడి పెట్టొచ్చు. ఇందుకోసం విడతలవారీగా పెట్టుబడులు పెట్టేలా.. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ (సిప్) విధానం ఎంచుకుంటే అనువుగా ఉంటుంది. షరా మామూలుగా చెప్పే విషయాలేమిటంటే.. స్టాక్‌మార్కెట్లలో పెట్టే పెట్టుబడుల్లో రిస్కు ఉంటుందన్న సంగతి గుర్తుంచుకోవాలి. రిటైల్ ఇన్వెస్టర్లు ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేసినా, ముందు కొంతైనా అధ్యయనం చేయడం మంచిది. అలాగే, తమ వయసు, ఆదాయం, రిస్కు సామర్థ్యం, ఎంతకాలం పెట్టుబడులు పెట్టగలరు, ఆర్థిక లక్ష్యాలు తది తర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. అప్పుడే ఈక్విటీల్లో పెట్టుబడులపై ఒక నిర్ణయానికి రావాలి.