
రాజధానిలో ఒక్క రోజే 11 చోట్ల చైన్ స్నాచింగ్
గొలుసు దొంగల బీభత్సం
- రాజధానిలో ఒక్క రోజే 11 చోట్ల చైన్ స్నాచింగ్
- బాధితుల్లో మాజీ మంత్రి అత్తయ్య
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో చైన్ స్నాచర్లు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. మంగళవారం ఒక్కరోజే ఏకంగా 11 ప్రాంతాల్లో 40.5 తులాల బంగారం దోచుకెళ్లారు. బాధితుల్లో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్లు అత్తయ్య సత్యవతి (76) కూడా ఉన్నారు. ఫిలింనగర్‌లోని ఓ గుడిలో దైవ దర్శనం చేసుకుని కారు కోసం వేచి చూస్తుండగా బైక్‌పై ఇద్దరు దుండగులు వచ్చి ఆమె మెడలోని 4 తులాల గొలుసు లాక్కెళ్లారు.
ఇది గమనించిన కారు డ్రైవర్ వారిని వెంబడించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనలో గాయపడిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అదే దారిలో ముందుకు వెళ్లిన దుండగులు.. ఫిలింనగర్ బస్తీకి చెందిన మల్లీశ్వరి (30) రోడ్డు దాటుతుండగా ఆమె మెడలోని రెండు తులాల గొలుసు లాక్కెళ్లారు.
వాకింగ్‌కు వెళ్లి వస్తుండగా..
దోమలగూడ హౌసింగ్ బోర్డు నివాసి రమాదేవి (65) ఉదయం వాకింగ్‌కు వెళ్లి వస్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు అగంతకులు.. ఆమె మెడలోని 5 తులాల గొలుసు అపహరించారు. చిక్కడపల్లి పరిధిలోని గాంధీనగర్‌లో నివసించే సునీత.. అశోక్‌నగర్‌లోని ఓ డాక్టర్ అపాయింట్‌మెంట్ కోసం వెళ్లి వస్తుండగా ఇద్దరు దుండగులు 9 తులాల మంగళసూత్రం లాక్కెళ్లారు. కూకట్‌పల్లిలోని వివేకానందనగర్ కాలనీకి చెందిన స్వప్న (36) తన కుమారుడిని స్కూల్‌కు పంపించి వస్తుండగా ఆమె మెడలోని మూడు తులాల గొలుసును దుండగులు తీసుకెళ్లారు.
కేపీహెచ్‌బీ నివాసి మల్లేశ్వరి (55) తన మనవడిని స్కూల్‌లో దించి వస్తుండగా రెండు తులాల చైన్ లాక్కెళ్లారు. అదే ప్రాంతానికి చెందిన జలజ (50) కూరగాయలు కొనుక్కుని వస్తుండగా ఆమె మెడలోని నల్లపూసల హారాన్ని దుండగులు తీసుకెళ్లాలని ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించడంతో ఒక తులం మాత్రమే వారు తీసుకెళ్లారు.
నడుచుకుంటూ వెళ్తుండగా..
బల్కంపేట డివిజన్‌కు చెందిన అంబిక నడుచుకుంటూ వెళ్తుండగా వెనక నుంచి వచ్చిన ఇద్దరు అగంతకులు.. 4 తులాల గొలుసు తెంచుకెళ్లారు. దారుస్సలాం సేవక్‌నగర్ నివాసి స్వరూపమ్మ ఉదయం పాల ప్యాకెట్ల కోసం వెళ్తుండగా ఓ దుండగుడు మూడున్నర తులాల మంగళసూత్రాన్ని లాక్కెళ్లాడు. సనత్‌నగరర్‌లోని జెక్‌కాలనీకి చెందిన సువర్చల (52) ఉదయం మెడికల్ షాప్‌కు వెళ్లి వస్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని 7 తులాల గొలుసులు ఎత్తుకెళ్లారు. సనత్‌నగర్ పోలీసులు సీసీ కెమెరాల్లోని ఫుటేజీ ఆధారంగా చైన్‌స్నాచర్ల ఫొటోలను విడుదల చేశారు. కాగా, ఎల్బీ నగర్ పరిధిలోని వనస్థలిపురంలో మంగళవారం రాత్రి దుండగులు ఓ మహిళ మెడలోని చైన్ లాక్కెళ్లారు. అయితే అది రోల్డ్ గోల్డ్‌గా తేలింది.