
ఆర్టీసీకి ‘ఫిట్‌మెంట్’ తంటా!
ఆర్టీసీకి ఇప్పుడు ఏ నెలకు ఆ నెల అగ్ని పరీక్షే! వేతనాలు చెల్లించేందుకు యాజమాన్యం నానా హైరానా పడాల్సి వస్తోంది...
- వేతనాలు పెంచేసి చేతులు దులుపుకొన్న సర్కారు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీకి ఇప్పుడు ఏ నెలకు ఆ నెల అగ్ని పరీక్షే! వేతనాలు చెల్లించేందుకు యాజమాన్యం నానా హైరానా పడాల్సి వస్తోంది. ఈ తరుణంలో.. ప్రభుత్వం కార్మికులు అడిగిన దాని కంటే ఎక్కువగా వేతనాలు పెంచి భారాన్ని మరింత మోపింది. ఉద్యోగులకు 44 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించి చేతులు దులుపుకొన్న సర్కారు.. ఆ రూపంలో సంస్థపై పెరిగిన భారాన్ని మోసేందుకు ఇప్పటి వరకు ముందుకు రాలేదు. ఫలితంగా నెలవారీ వేతనాల చెల్లింపు సాధ్యం కాక ఆర్టీసీ యాజమాన్యం తల పట్టుకుంటోంది. తాజాగా మూడేళ్ల ఆర్జిత సెలవుల (ఎర్న్‌డ్ లీవ్స్) బకాయిల చెల్లింపు కోసం ప్రభుత్వాన్ని ఆశ్రయించింది.
ఇప్పటి వరకు ఎలాంటి సానుకూల సంకేతం రాకపోవటంతో ఈ నెలలో ఆ మొత్తాన్ని చెల్లించే అవకాశం లేదని యాజమాన్యం పరోక్షంగా సంకేతాలిచ్చింది. ఆ మొత్తం రూ.30 కోట్లు మాత్రమే! ఈ మొత్తాన్నే చెల్లించలేని పరిస్థితి ఉండగా.. 44 శాతం ఫిట్‌మెంట్ రూపంలో మరో గండం వస్తోంది. ఫిట్‌మెంట్ కింద పాత బకాయిల చెల్లింపు తొలి వాయిదా వచ్చే నెలలోనే ఉంది. ఈ బకాయిలూ చెల్లించే పరిస్థితి లేదని ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి మొరపెట్టుకుంది. అంతర్గత సామర్థ్యం పెంచుకుని ఆదాయం పెంపుపై దృష్టి సారించాలని వేతన సవరణ సమయంలో సీఎం చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సాయం అందే అవకాశం అంతంత మాత్రమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఫిట్‌మెంట్ బకాయిలకూ తిప్పలే..
44 శాతం మేర ఫిట్‌మెంట్‌తో జరిగిన వేతన సవరణను 2013 ఏప్రిల్ నుంచి అమలు చేయాల్సి ఉంది. పాత బకాయిల్లో 50 శాతం మొత్తాన్ని బాండ్ల రూపంలో చెల్లించనున్నట్టు ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. మిగతా 50 శాతం మొత్తాన్ని మూడు విడతల్లో చెల్లించనున్నట్టు తెలిపింది. అందులో తొలి విడత 2015 దసరాకు చెల్లించాలి. దసరా వేతనం వచ్చే నెలలో చెల్లించాలి. తొలి విడత చెల్లించాల్సిన బకాయిల మొత్తం రూ.150 కోట్లు.
అంటే వచ్చే నెలలో వేతనాలతోపాటు ఈ రూ.150 కోట్లూ చెల్లించాలి. అంత మేర ఆదాయం లేనందున దాన్ని చెల్లించే పరిస్థితి లేదని ప్రభుత్వానికి ఆర్టీసీ లేఖ రాసింది. గత నెలలో కొత్త వేతనాలు ఇవ్వటం సాధ్యం కాక ప్రభుత్వం నుంచి వచ్చిన బస్‌పాస్ కన్సెషన్ రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని వినియోగించుకుంది. వచ్చే నెలలోనూ ఆ రూపంలో ప్రభుత్వం రూ.70 కోట్లు ఇవ్వనుంది. అది రెగ్యులర్ వేతనాలకే సరిపోతుంది. బకాయిల రూపంలో చెల్లించాల్సిన రూ.150 కోట్ల సంగతి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఇదీ ‘ఆర్జిత’ లెక్క..
ఆర్టీసీ ఆదాయం అంతంత మాత్రంగా ఉండటంతో 2012 నుంచి కార్మికులకు ఆర్జిత సెలవుల మొత్తాన్ని చెల్లించటం లేదు. ఆ బకాయిలు కాస్తా ఇప్పుడు తడిసి మోపెడయ్యాయి. వేతన సవరణ కోసం ఇటీవల ఆర్టీసీలో సమ్మె జరిగినప్పుడు కార్మికులతో యాజమాన్యం ప్రత్యేకంగా ఒప్పందం చేసుకుంది. అందులో ఆర్జిత సెలవుల బకాయిల చెల్లింపు అంశం కూడా ఉంది. ఒప్పందం ప్రకారం 2012 సంవత్సరం బకాయిలను ఆగస్టు నెల వేతనంతో చెల్లించాలి. 60 వేల మంది కార్మికులకు సంబంధించి ఒక సంవత్సరం బకాయి రూ.30 కోట్లు. ఈ చెల్లింపులకు సంబంధించిన కసరత్తు ఇప్పటికే మొదలు కావాలి. కానీ డబ్బులు లేకపోవటంతో కేవలం ఈ నెల వేతనాలే సిద్ధం చేస్తున్నారు.