
సభలో విల్లు ఎక్కుపెట్టిన హరీష్ రావు
ఆర్టీసీలో ఫలితాలు బాగుంటే వచ్చే ఏప్రిల్లో భారీ ఫిట్మెంట్ పెంచనున్నట్లు హరీష్ తెలిపారు.
ముషీరాబాద్: ఆర్టీసీ బస్సుల్లో ప్రస్తుతం 60 నుంచి 65 వరకు ఉన్న ఓఆర్‌ను 80 నుంచి 85 వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్మికులపై ఉందని తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) గౌరవ అధ్యక్షులు, మంత్రి హరీష్‌రావు అన్నారు. మంగళవారం బస్ భవన్ ఆవరణలో టీఎంయూ విజయోత్సవ సభ నిర్వహించారు. కార్యక్రమానికి హోంమంత్రి నాయిని, రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, డిప్యూటి స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఆర్టీసీ ఎండీ రమణారావు, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ప్రభాకర్‌రావు, టిఎంయు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశ్వధ్దామరెడ్డి, థామస్‌రెడ్డి, తిరుపతి తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ ఆర్టీసీలో కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. 44 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చి ఆర్టీసీ కార్మికుల మన్ననలు పొందారని, 85 శాతం ఓఆర్ సాధించి వచ్చే ఏప్రిల్లో భారీ ఫిట్‌మెంట్‌ను సాదిద్ధామన్నారు. అప్పటివరకు ప్రజా ప్రతినిధులు కూడా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా కృషి చేస్తామన్నారు. ప్యాసింజర్ ఆటోలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రైతుల ఉసురు తగులుతుంది
కాంగ్రెస్ పార్టీకి రైతుల ఉసురు తగులుతుందని మంత్రి హరీష్‌రావు అన్నారు. లోకమంతా ఒక దారి అయితే కాంగ్రెస్ పార్టీది మరో దారని ఎద్దేవా చేశారు. ఖమ్మంలో కాంగ్రెస్ నేతలు సీపీఎం అనుబంధ యూనియన్‌కు ఆర్టీసీ ఎన్నికల్లో మద్దతు తెలిపారన్నారు. అధికారంలో ఉన్నపుడు కుర్చీలు, పదవుల కోసం కొట్లాడుకునే నాయకులు ప్రస్తుతం అభివృధ్ది పనులకు అడ్డుతగులుతూ కోర్టుల్లో కేసులు వేస్తున్నారని ఆరోపించారు.