అప్పులున్నా గొప్పగానే!
పెరిగిన రాష్ట్ర రుణ పరపతి
* వడ్డీ రేటు రాష్ట్రానికే తక్కువ
* దేశంలో చేబదులు తీసుకోని రాష్ట్రాలు రెండే..
* అందులో ఒకటి గుజరాత్.. రెండోది తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రుణ పరపతి పెరిగింది. రెండో ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు దాదాపు రూ. 7,000 కోట్లు అప్పు చేసింది.
కొత్త రాష్ట్రమైనప్పటికీ... అన్ని రంగాల్లో వడివడిగా అడుగులు వేస్తుండటం.. తొలి ఏడాదితో పోలిస్తే రెండో ఏడాది సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో దూసుకుపోవటంతో రుణ పరపతి పెరిగిందని ఆర్థిక శాఖ విశ్లేషిస్తోంది. ఆర్‌బీఐ నిర్వహించే వేలంలో తెలంగాణకు తక్కువ వడ్డీ రేటుకు అప్పులు ఇచ్చేందుకు బ్యాంకులు పోటీ పడుతున్నాయి. అందుకే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అత్యల్ప వడ్డీ రేటుకు ఈ అప్పులు తెచ్చుకున్నట్లుగా అధికారులు వెల్లడించారు.
ప్రతి నెలలో రెండు సార్లు తమ దగ్గరున్న సెక్యూరిటీలను వేలం వేసి అప్పులు తీసుకునేందుకు రిజర్వు బ్యాంక్ రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం కల్పిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు తొమ్మిది సార్లు ఆర్‌బీఐ రాష్ట్రాల సెక్యూరిటీలను వేలం వేసింది. అందులో ఆరు సార్లు రాష్ట్రం తనసెక్యూరిటీలను పెట్టి అప్పు తెచ్చుకుంది. ఏప్రిల్‌లో రూ. 1,000 కోట్లు, మే నెలలో రూ. 1,348 కోట్లు, జూన్‌లో రూ. 1,300 కోట్లు అత్యధికంగా జూలై నెలలో రూ. 2,500 కోట్లు, ఆగస్టులో రూ. 800 కోట్లు అప్పు తెచ్చింది.
ఒక్కోసారి ఒక్కో వడ్డీ రేటు నమోదైనప్పటికీ.. గరిష్ఠంగా 8.26 శాతం వడ్డీ రేటుకు రుణం తీసుకున్నట్లుగా ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించారు. దేశీయ మార్కెట్‌లో తెలంగాణపై పెట్టుబడిదారులకు, రుణ సంస్థలకు ఉన్న నమ్మకానికి ఈ రేటింగ్ అద్దం పడుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం దేశంలో మిగులు రాష్ట్రాల జాబితాలో గుజరాత్ తర్వాత స్థానంలో ఉండటం కూడా అందుకు దోహదపడింది.
చేబదులు చేయని రాష్ట్రం.. ఆదాయం అంచనాలకు తగ్గి.. అంతకు మించి వ్యయం పెరిగినప్పుడు ఆర్థిక నిర్వహణ ఒడిదొడుకులకు గురవటం అన్ని రాష్ట్రాల్లో సర్వ సాధారణం. అటువంటి కటకట నుంచి బయటపడేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి నెలసరి వచ్చే గ్రాంట్లు, పన్నుల వాటా నిధులను ముందస్తుగానే చేబదులుగా తీసుకునే వెసులుబాటు ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచీ వేస్ అండ్ మీన్స్‌గా పరిగణించే ఈ చేబదులు తీసుకోని రాష్ట్రాలు దేశంలో రెండే ఉన్నాయి. తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాలు ఈ జాబితాలో ఉండటం మెరుగైన ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతుందని ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించారు.
సీలింగ్‌తో సమస్య... మరోవైపు అప్పులపై సీలింగ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటాడుతోంది. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల ప్రకారం 2015-16లో తీసుకునే రుణాల మొత్తం రూ. 15295 కోట్లకు మించకూడదు. కానీ.. ఆర్థిక శాఖ గడచిన అయిదు నెలల్లోనే సెక్యూరిటీల వేలం ద్వారా రూ. 6448 కోట్లు, కేంద్రం నుంచి మరో రూ. 398 కోట్లు అప్పు తీసుకుంది. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను సడలించి మరింత అప్పు తెచ్చుకునేందుకు అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేయటం గమనార్హం.