అమెరికా అణు సత్తాను పెంచాలి
అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ ట్వీట్
వాషింగ్టన్/మాస్కో: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధ ముప్పును ప్రపంచం గుర్తించే వరకు తమ దేశ అణ్వస్త్ర సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. అమెరికా వైమానిక దళ లెఫ్ట్‌నెంట్ జనరల్ జాక్ వైన్‌స్టెయిన్ తదితర ఉన్నతస్థాయి అధికారులతో సమావేశమైన తర్వాతి రోజే ట్రంప్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ‘కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన∙ట్రంప్.. అమెరికాలో పెనుమార్పునకు సంబంధించిన అంశంపై 140 అక్షరాల్లో వ్యాఖ్యలు చేయడం ప్రమాదకర విషయం. అణ్వాయుధ విధానం అనేది చాలా క్లిష్టమైన విషయం. భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి మీద అది ప్రభావం చూపుతుంది’ అని ఆయుధ నియంత్రణ, అణ్వాయుధ వ్యాప్తి నిరోధక (నాన్–ప్రోలిఫరేషన్) కేంద్రం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, కాంగ్రెస్ మాజీ సభ్యుడు జాన్ టైర్నే హెచ్చరించారు. కాగా, మొత్తం 7 వేలకుపైగా అణ్వాయుధాలతో అమెరికా తొలి స్థానంలో ఉండగా.. తర్వాత స్థానాల్లో రష్యా, యూకే, ఫ్రాన్స్, చైనా దేశాలున్నాయి.
కొత్త విషయమేం కాదు: రష్యా
అమెరికా అణు సామర్థ్యాన్ని పెంచాలంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. ‘అసాధారణ విషయం ఏమీ లేదు’ అని పేర్కొన్నారు. ‘ట్రంప్ వ్యాఖ్యలు కొత్తవేం కాదు. అమెరికా అణు సత్తా పెంచాలంటూ ఎన్నికల ప్రచారంలోనే ఆయన చెప్పాడు. తాజా వ్యాఖ్యల్లో అసాధారణ విషయం ఏం లేదు’ అని అన్నారు.